కుట్ర రాజకీయాలకు తెరలేపిన వైఎస్ జగన్: దేవినేని ఉమా
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:28 PM
అధికార యంత్రాంగంపై కేసుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కుట్ర రాజకీయాలకు తెరలేపారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.
అమరావతి, అక్టోబర్ 30: అధికార యంత్రాంగంపై కేసుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కుట్ర రాజకీయాలకు తెరలేపారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. విపత్తుల వేళ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. వరదల సమయంలో క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న ఉద్యోగులను టార్గెట్ చేయడం దుర్మార్గమని అన్నారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 40 వేల మంది సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. గతంలో నేషనల్ హైవేలపై షామియానాలు, పరదాలు వేసుకుని తిరిగిన చరిత్ర వైఎస్ జగన్‌దని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పులివెందులలో 64 ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు కూడా వేయలేని స్థితిలో వైసీపీ ఉందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల్లో అభ్యర్థులను పెట్టలేని వైఎస్ జగన్.. చొక్కాలు మడత పెడతాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఆర్నబ్ తుపాను సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పొలంలోకి వెళ్లి రైతులను ఓదార్చి.. వారికి భరోసా కల్పిస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు. తుపాను నష్టాన్ని కేంద్రానికి తెలిపి వెంటనే కేంద్ర బృందాలను రప్పిస్తున్నామని చెప్పారు. 'అన్నదాత సుఖీభవ' కింద రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం రైతుల కోసం రూ.32,800 కోట్లు ఖర్చు చేయనుందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదని అన్నారు. ఆయన దూరదృష్టితో పట్టిసీమను నిర్మించారని తెలిపారు. ఎల్ నినో సంక్షోభాన్ని పట్టిసీమ ద్వారా సమర్థవంతంగా అధిగమించామని వివరించారు.
కష్టకాలంలోనూ రాయలసీమ ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు దాకా సాగునీరు అందించామని దేవినేని ఉమా గుర్తు చేశారు. వైసీపీ హయాంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానంలో నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో వరి నష్టపరిహారం ఎకరాకు రూ.17,000 ఉంటే, దాన్ని రూ.25,000కు పెంచారని చెప్పారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1,700 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. పెన్షన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం రూ.79 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తుపాను బాధితుల కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పంచదార పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
అలాగే మత్స్యకార, చేనేత కుటుంబాలకు 50 కిలోల బియ్యం. చేనేత వర్గాలకు రూ.25,000, పడవలకు రూ.25,000, కొత్త వలలకు రూ.10,000, వలల మరమ్మతులకు రూ.5,000, చేపల చెరువులకు రూ.17,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చనిపోయిన ఆవుకు రూ.50,000, గేదెకు రూ.40,000, గొర్రె/మేకకు రూ.7,500 పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.25,000 నుంచి రూ.35,000; దెబ్బతిన్న ఇళ్లకు రూ.10,000; ఎంఎస్ఎంఈలకు రూ.50,000 నుంచి రూ.1.5 లక్షలు; దుకాణాలు లేదా హోటళ్లకు రూ.25,000; తోపుడు బండ్లకు రూ.20,000; వాహన మరమ్మతులకు రూ.3,000 నుంచి రూ.10,000 వరకు సాయం అందిస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమా చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు.. రూ.2,234 కోట్లు విడుదల
పలు జిల్లాల్లో టీజీ సేఫ్ మెరుపు దాడులు.. 9 కేంద్రాల లైసెన్సులు సస్పెండ్
For More AP News And Telugu News