రేపటి నుంచి అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. లీటరుపై రూ.2 నుంచి రూ.4 వరకు పైకి
ABN , Publish Date - Nov 11 , 2026 | 09:20 PM
పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పాల ధరలను పెంచుతున్నామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, అమూల్‌కు పోటీ సంస్థ అయిన మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచామని ప్రకటించింది. లీటరుపై రూ.2 నుంచి రూ.4 పెంచామని మదర్ డెయిరీ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాల ఉత్పత్తుల కంపెనీలు అమూల్, మదర్ డెయిరీ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. పాల ధరలను పెంచుతున్నామని బుధవారం ఓ ప్రకటనలో ఆ కంపెనీలు వేర్వేరుగా తెలిపాయి. అమూల్ పాల రకాన్ని బట్టి లీటరుపై రూ.2 నుంచి రూ.4 వరకు ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. పెరిగిన ధరలు ఈనెల 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. గత ఏడాది కాలంగా పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. పశువుల మేత, దాణాలో ఉపయోగించే నూనె గింజల చెక్క, మొక్కజొన్న, మొలాసిస్ ధరలు పెరిగాయని పేర్కొంది. అంతేకాకుండా పాల ప్యాకేజింగ్ ఫిల్మ్, ఇంధన వ్యయాలు కూడా పెరిగాయని వివరించింది. ఈ నేపథ్యంలో పాల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని వెల్లడించింది.
గుజరాత్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో పాల ఉత్పత్తిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమూల్ తెలిపింది. ఈ పరిస్థితుల్లో పాడి రైతులకు అండగా నిలిచేందుకు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని వివరించింది. గత ఏడాది కాలంలో తమ అనుబంధ పాల ఉత్పత్తిదారుల సంఘాలు రైతులకు చెల్లించే పాల సేకరణ ధరలను 4 నుంచి 5 శాతం పెంచాయని పేర్కొంది. కొత్త ధరల ప్రకారం అమూల్ తాజా టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.2 పెరిగి రూ.62కు చేరింది. అమూల్ గోల్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ.4 పెరిగి రూ.80కి చేరింది. 2026 మే నెలలోనూ అమూల్ పాల ధరలను పెంచింది.
మదర్ డెయిరీ కూడా
అమూల్‌కు పోటీ సంస్థ అయిన మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచామని ప్రకటించింది. ఉత్పత్తి వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని మదర్ డెయిరీ తెలిపింది. లీటరుపై రూ.2 నుంచి రూ.4 పెంచామని ఆ కంపెనీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...