Share News

మిత్రపక్షాలకు 60 సీట్లు.. యూపీలో ఎన్డీయే యోచన

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:46 PM

యూపీలో ఎన్డీయే కూటమి బలోపేతం దిశగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కూటమి పార్టీలకు 60 సీట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

మిత్రపక్షాలకు 60 సీట్లు.. యూపీలో ఎన్డీయే యోచన
UP NDA Seat Sharing

ఇంటర్నెట్ డెస్క్: యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి బలోపేతం దిశగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో కూటమి పార్టీలకు 60 సీట్లు ఇచ్చే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మిత్రపక్షాలైన రాష్ట్రీయ లోక్ దళ్, భారతీయ సమాజ్ పార్టీ, అప్నా దళ్, నిషాద్ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే ఫార్ములపై కసరత్తు చేస్తోంది. కుల, ప్రాంతీయ సమీకరణాల దృష్ట్యా బీజేపీ విస్తృత స్థాయి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.


ఈ సీట్ల పంపకాలు విజయవంతంగా పూర్తి చేయడమే యూపీలో ఎన్డీయే ఐక్యతకు అతిపెద్ద పరీక్ష అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిత్ర పక్షాల కోసం బీజేపీ ఎన్ని సీట్లను వదులుకుంటుందనే అంశం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ అంశాలపై బీజేపీ ప్రతినిధి మనీష్ శుక్లా మాట్లాడారు. 2027 ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే ఎన్డీయే పక్షాల లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో ప్రజల పూర్తిస్థాయి మద్దతు లభిస్తే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడం సాధ్యమవుతుందని అన్నారు. సీట్ల పంపకాల అంశం ఎన్డీయేలో చర్చించడమే సబబని అన్నారు.


ఈ పరిణామాలపై సమాజ్ వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. వచ్చే ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఆందోళనతో ఉందని చెప్పింది. అందుకే మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చేందుకు దిగొచ్చిందని వ్యాఖ్యానించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నమ్మకం బీజేపీకి లేదని పేర్కొంది. రాష్ట్రంలో ప్రజలకు బీజేపీ దూరమైందని ఎస్పీ నేత దినకర్ జైన్ అన్నారు. ఎన్డీయే కూటమిని మరింత విస్తరించినా విజయం దక్కదని స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత మాజీ ఉప రాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు

Updated Date - Nov 11 , 2026 | 06:46 PM