అమెజాన్‌లో 250 ఉద్యోగాలు ఫట్.. పొద్దున్నే ఉద్యోగులకు మెసేజ్
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:00 AM
అమెజాన్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 250 మంది ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించింది. ‘ఈరోజు నుంచి మీరు ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదు’ అని ఉద్యోగులకు మెయిల్, ఫోన్‌లో మెసేజ్ పంపింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెజాన్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 250 మంది ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించింది. ‘ఈరోజు నుంచి మీరు ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదు’ అని ఉద్యోగులకు మెయిల్, ఫోన్‌లో మెసేజ్ పంపింది. కిండిల్ ఈ-రీడర్స్, ఎకో స్మార్ట్ స్పీకర్ల వ్యవహారాలు చూసే యూనిట్‌లో ఈ కోతలు పెట్టింది. ఈ విషయాన్ని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ చెర్రీ రాబిన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ నిర్మాణం గురించి పూర్తిగా సమీక్ష నిర్వహించామని, దీంతో ఉద్యోగాల్లో కోతలు విధించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. కంపెనీలో కొద్దిమంది ఉద్యోగులను తొలగించాలని తాము కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. మరింత సమర్థంగా పనిచేసేందుకు ఉద్యోగాల కోత తోడ్పడుతుందని పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లోనే మెమో
ఉద్యోగాల కోతకు సంబంధించి గత నెలలోనూ అమెజాన్ ఒక మెమోను జారీ చేసింది. ఏఐ అభివృద్ధి నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులను తొలగిస్తామని అందులో కంపెనీ తెలిపింది. రోజురోజుకు వస్తున్న మార్పులను స్వాగతించాలని, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రాక్టీసెస్‌కు ఏఐ కీలకం కాబోతుందని పేర్కొంది. కాగా.. అమెజాన్ ఐదు కొత్త అలెక్సా పవర్డ్ పరికరాలను కొనుగోలు చేసిన రోజే ఉద్యోగాల కోతలను చేపట్టింది. ఈ కొత్త పరికరాల్లో ఎకోషో 16 స్మార్ట్ డిస్‌ప్లే, అలెక్సా ఫోటో ఫ్రేమ్, ఎకో టైమ్ బెడ్‌సైడ్ క్లాక్ ఉన్నాయి. ఈ పరికరాలను కంపెనీకి చెందిన డివైసెస్ విభాగం అభివృద్ధి చేసింది. ఈనెల ప్రారంభంలో కూడా అమెజాన్ తన ప్రధాన రిటైల్ విభాగంలో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అంతేకాకుండా నిరుడు అక్టోబర్‌లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు ఏఐ రంగంలో అమెజాన్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఏఐ కోసం కంపెనీ 220 బిలియన్ డాలర్ల (రూ.దాదాపు 20 లక్షల కోట్లు) వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని అంచనా.
ఇవి కూడా చదవండి...
కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక