పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయుల మృతి.. కేంద్రం వెల్లడి
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:05 AM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు వంటి ఘర్షణల్లో 22 మంది భారతీయులు చనిపోయారని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. మృతుల్లో 14 మంది నౌవికులు ఉన్నారని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు వంటి ఘర్షణల్లో 22 మంది భారతీయులు చనిపోయారని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. మృతుల్లో 14 మంది నౌవికులు ఉన్నారని తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఆ ప్రాంతంలోని భారతీయులతో పాటు నౌకల్లో పనిచేస్తున్న వారితో, అక్కడి భారత దౌత్య కార్యాలయాలతోనూ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా సౌదీ అరేబియాలో మరో ముగ్గురు భారతీయులు మరణించినట్లు కూడా వెల్లడించారు. పశ్చిమాసియాలోని భారత దౌత్య అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని, గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ కార్మికులు, నౌకా సిబ్బంది భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
భారతీయుల కోసం అదనపు విమాన సర్వీసులు
సౌదీ అరేబియాలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు, ముఖ్యంగా ఉమ్రా యాత్రికులకు సహాయం చేసేందుకు జెడ్డాలోని భారత కాన్సులేట్ కొత్త ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. సౌదీ అరేబియా నుంచి భారత్‌లోని పలు నగరాలకు విమాన సర్వీసులను పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కాన్సులేట్ తెలిపింది. ఇందుకోసం సౌదీ విమానయాన అధికారులతో పాటు విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. విమాన సర్వీసులకు సంబంధించిన తాజా వివరాలను జెడ్డాలోని భారత కాన్సులేట్ ‘ఎక్స్’ లో తెలిపింది.
ఈ వార్తలూ చదవండి
దాడులు ఆపితే బిలియన్ డాలర్లు ఇస్తాం
మెలానియా జోక్యం..యుద్ధంలో కాస్త విరామం