దాడులు ఆపితే బిలియన్ డాలర్లు ఇస్తాం
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:46 AM
తమపై దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు(రూ.10వేల కోట్లు) ఇస్తామంటూ సౌదీ అరేబియా..హూతీలకు ప్రతిపాదన పంపించింది
హూతీలకు సౌదీ అరేబియా ఆఫర్!
జెరూసలేం, రియాద్, అక్టోబరు 27: తమపై దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు(రూ.10వేల కోట్లు) ఇస్తామంటూ సౌదీ అరేబియా..హూతీలకు ప్రతిపాదన పంపించింది. తమ చమురు క్షేత్రాలపై యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేసింది. ఇరాన్‌లో ఆకస్మికంగా పర్యటించిన సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఈ ప్రతిపాదన చేశారు. ఇందుకు ఇరాన్ మధ్యవర్తిత్వం వహించేలా ఏర్పాట్లు జరిగాయని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. హెర్కులస్ మిలటరీ రవాణా విమానంలో సొమ్ము కూడా తీసుకెళ్లారని పేర్కొన్నాయి. అయితే సొమ్ము ఇచ్చిందీ లేనిదీ నిర్ధారణ కాలేదు. మరోవైపు, సౌద అరేబియాకు రక్షణ సాయం అందించేందుకు టర్కీ ముందుకు వచ్చింది. దీనిపై హూతీలు తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం ద్వారా ఈజిప్టు తమ దేశంపై పరోక్షంగా యుద్ధం ప్రకటించినట్లయిందని హూతీల సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, సౌదీ రాజధాని రియాద్‌లోని రక్షణ శాఖ కార్యాలయంపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు హూతీ తిరుగుబాటుదారులు మంగళవారం ప్రకటించారు. కానీ, ఆ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.