Share News

చలికాలంలో ఎన్నికలు నిర్వహించడం ఏంటి? వాంగ్‌చుక్‌ అభ్యంతరం

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:27 PM

ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను పోలీసులు 60 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్ ఎక్స్‌లో తెలిపారు. రానున్న లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఏహెచ్‌డీసీ) ఎన్నికలకు వ్యతిరేకంగా ఆయన నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

చలికాలంలో ఎన్నికలు నిర్వహించడం ఏంటి? వాంగ్‌చుక్‌ అభ్యంతరం

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను పోలీసులు 60 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్ ఎక్స్‌లో తెలిపారు. రానున్న లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఏహెచ్‌డీసీ) ఎన్నికలకు వ్యతిరేకంగా ఆయన నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు లేహ్‌ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిధిలో తమ అనుమతి లేకుండా వాంగ్‌చుక్ ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించడం వంటివి చేయరాదని, అలాగే అలాంటి ప్రదర్శనల్లో పాల్గొనరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తక్షణమే ఆ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, 60 రోజుల పాటు అవి కొనసాగుతాయని తెలిపారు.


అంతకుముందు రోజు లేహ్‌లో నిరసన ప్రదేశం నుంచి వాంగ్‌చుక్‌ను పోలీసులు తరలించారు. వచ్చే నెల 4న హిల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాంగ్‌చుక్‌తో పాటు పలువురు ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. ఆ ఉత్తర్వులు వెలువడడానికి కొన్ని గంటల ముందే తనను గృహ నిర్బంధంలో ఉంచారని వాంగ్‌చుక్‌ ఎక్స్‌లో వెల్లడించారు. తన ఇంటి చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారని ఆయన తెలిపారు. గత ఏడాది లేహ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై న్యాయపరమైన విచారణ కమిషన్‌ నివేదికను అమలు చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకే తనపై ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు, చలికాలంలో కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.


కాగా.. 2019లో లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న తొలి ప్రధాన ఎన్నికలు ఇవే. ఈ ప్రాంతంలోని మొత్తం ఎనిమిది అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిళ్లకు డిసెంబరు 4న ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, వీటిలో 36 స్థానాలను మహిళలకు కేటాయించారు. అయితే, చలికాలంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు, స్థానికుల వలసల కారణంగా చాలా మంది తమ ఓటుహక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుందని వాంగ్‌చుక్‌తో పాటు ఇతర స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని కూడా వారు పిలుపునిస్తున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ ప్రకారం ప్రత్యేక రక్షణ కల్పించాలని రాజకీయ పార్టీలతో పాటు పౌర సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచిన ఏపీ ప్రభుత్వం

ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. కేంద్ర ఆర్థిక సాయం కోరనున్న ప్రభుత్వం

Updated Date - Nov 13 , 2026 | 05:07 PM