ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచిన ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:30 PM
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఏకగ్రీవాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, నవంబర్ 13: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా పెంచుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుల స్థానాలన్నీ అధికారికంగా ఏకగ్రీవమైతేనే ఈ ప్రోత్సాహకాలకు అర్హత లభిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ కాంతిలాల్ దండే జీవో జారీ చేశారు.
రాష్ట్రంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నగదును ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది. జనాభా ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలను పెంచినట్లు తెలిపింది. 5,000 లోపు జనాభా గల పంచాయతీలు ఏకగ్రీవమైతే.. ప్రోత్సాహకాన్ని రూ.15 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
జనాభా 10,000 లోపు అనగా (5001 నుంచి 10000) ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ. 25 లక్షల నజరానాను పెంచింది. 10 వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే అత్యధికంగా రూ.50 లక్షల నజరానాను పెంచుతున్నట్లు ప్రకటించింది.
అయితే ఈ ప్రోత్సాహకాలను పొందేందుకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది.
- సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల స్థానాలన్నీ అధికారికంగా ఏకగ్రీవమైతేనే ఈ ప్రోత్సాహకానికి అర్హత లభిస్తోంది.
- ఈ నజరానా నగదును కేవలం గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులకు మాత్రమే ఉపయోగించాలి.
- ఏకగ్రీవమైన పంచాయతీల పదవీకాలంలోనే.. ఈ పెంచిన నగదును విడతల వారిగా ప్రభుత్వం విడుదల చేస్తుంది.
- ఈ తాజా ఉత్తర్వులు కేవలం రాబోయే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు-2026 కు మాత్రమే వర్తిస్తాయి.
- ఏకగ్రీవాల పేరుతో పోటీ చేసే అభ్యర్థుల హక్కుకు గానీ, ఓటర్ల స్వేచ్ఛకు గానీ ఎలాంటి ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది.