ముంబై పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజనింగ్.. 100 మందికి అస్వస్థత
ABN , Publish Date - Nov 03 , 2026 | 09:35 AM
ముంబైలో ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ వేడుకలో ఆహారం తిన్నవారిలో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సిటీలోని నహుర్ ప్రాంతంలోని నలంద బుద్ధ విహార్ హాల్లో ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ వేడుకలో ఆహారం తిన్నవారిలో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సిటీలోని నహుర్ ప్రాంతంలోని నలంద బుద్ధ విహార్ హాల్లో ఈ ఘటన జరిగింది. ఈ వేడుకకు 400 నుంచి 500 మంది వరకు అతిథులు హాజరయ్యారు. చివర్లో భోజనం చేసిన వారు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతో బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అధికారులు ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. కాగా.. బాధితులు ఖర్వాస్ అనే పాలతో తయారు చేసే స్వీట్ తిన్నట్లు అధికారులు గుర్తించారు. ఆహారం ఎలా కలుషితమైందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు. కాగా.. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 32 మాత్రమే అని మునిసిపల్ అధికారులు తెలిపారు. వారిలో 27 మంది ఎంటీ అగర్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందారని, మరో ఐదుగురు రాజావాడి ఆసుపత్రిలో చికిత్స పొందారని వెల్లడించారు. అయితే వారంతా వైద్యుల సూచనలను పట్టించుకోకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారని చెప్పారు
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి