ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:32 PM
ఢిల్లీలో దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. నిర్దేశిత సమయాల్లోనే ఈ టపాసులు కాల్చాలని స్పష్టం చేసింది. నిబంధనల అమలు బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే అని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి నేపథ్యంలో న్యూఢిల్లీలో పర్యావరణ హిత గ్రీన్ క్రాకర్స్‌ను కాల్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా అనుమతించింది. నవంబర్ 7, నవంబర్ 8 తేదీల్లో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తూ జస్టిస్ ఎంఎం సుంద్రేశ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆ రెండు రోజుల్లో ఉదయం 6 - 7 గంటల మధ్య, మళ్లీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే ఈ టపాసులను కాల్చేందుకు అనుమతిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ అంశంపై గతవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు నిరాకరించింది. నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పదే పదే మార్గదర్శకాలు జారీ చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదని, హాస్యాస్పందంగా మారుతుందని పేర్కొంది. ‘ప్రజల సెంటీమెంట్స్‌ను అర్థం చేసుకున్నాము. పూర్తిస్థాయి నిషేధం విధించలేము. కానీ ఆ స్థాయి కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి సృష్టించవద్దు’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీకి కోర్టు స్పష్టం చేసింది.
టపాసుల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. టపాసుల విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రిటీల సాయం తీసుకోవాలని కూడా సూచించింది. టపాసుల వల్ల పర్యావరణానికి కలిగే నష్టం, తలెత్తే అనారోగ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
దియా మిర్జా వీడియోపై బీజేపీ అభ్యంతరం.. వీడియో డిలీట్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్.. అమిత్ షా విమర్శలు