అమెరికాలో భారతీయులు ఆందోళన చేస్తే ఊరుకుంటారా?
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:20 AM
అమెరికా పౌరుడై ఉండి.. సర్‌ను నిరసిస్తూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ముంబైలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమెరికన్ అయ్యి ఉండి ‘సర్’పై నిరసనలో ఎలా పాల్గొంటారు?
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ముంబై, నవంబరు 2: అమెరికా పౌరుడై ఉండి.. సర్‌ను నిరసిస్తూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ముంబైలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలో ఓ భారతీయుడు ఇలాగే నిరసన తెలిపితే అక్కడి ప్రభుత్వం ఊరుకుంటుందా అని నిలదీసింది. సర్ అంశంపై మాట్లాడేందుకు, నిరసనలో పాల్గొనేందుకు ఆయనకు ఏ హక్కు లేదని స్పష్టం చేసింది. ఈసీకి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నందుకు సీనియర్ నటుడు ఆమీర్‌ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్‌ఖాన్‌ను గత నెల 10న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ లీవ్ ఇండియా నోటీసు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇమ్రాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇమ్రాన్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ అమెరికాలోనే పుట్టినప్పటికీ జీవితమంతా ఇండియాలోనే గడిపారని.. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి ఉన్నారన్నారు. అయితే, ఓసీఐ కార్డు ఉన్నంత మాత్రాన భారత పౌరుల మాదిరి ఇక్కడ రాజకీయ నిరసనల్లో పాల్గొనలేరని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే ఇమ్రాన్ హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఆందోళనల్లో పాల్గొనబోనని హామీనిచ్చారు. దీంతో, ఆయనపై జారీ అయిన లీవ్ ఇండియా నోటీసును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేస్తూ.. విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి