ఢిల్లీలో గ్రీన్ టపాసులకు సుప్రీం అనుమతి
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:16 AM
దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో రెండ్రోజుల పాటు గ్రీన్ టపాసులు కాల్చుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది
దీపావళికి రెండ్రోజులు వెసులుబాటు..9వ తేదీ నుంచి నిషేధం మళ్లీ అమలు
న్యూఢిల్లీ, నవంబరు 2: దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో రెండ్రోజుల పాటు గ్రీన్ టపాసులు కాల్చుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దేశ రాజధాని ప్రాంత (ఎన్‌సీఆర్) పరిధిలో ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 వరకు పర్యావరణహిత బాణసంచా కాల్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం ఇటీవల విచారించింది. తీర్పు వివరాలు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. గతంలో తామిచ్చిన ఆదేశాలు అమలుకాకపోవడంతో పాటు టపాసులు కాల్చడాన్ని అధికారులు అడ్డుకోకపోవడంపై ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఈసారి తామిచ్చిన ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.
ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, హెల్త్ సెంటర్లు, విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలకు 300 మీటర్ల పరిధిలో టపాసులు కాల్చడానికి వీల్లేదని, ఆ పరిధిని ‘నో క్రాకర్ జోన్’గా ప్రకటించి ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టపాసులు కాల్చడంపై ఈనెల 9 నుంచి సంపూర్ణ నిషేధం మళ్లీ కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది. అలాగే బాణసంచా తయారీదారులకు కూడా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. సీఎ్‌సఐఆర్-నీరి, పెసోల నుంచి ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందిన సంస్థలు మాత్రమే గ్రీన్ టపాసులు తయారు చేయాలని, అలాగే ఈనెల 2-6 మధ్య సీఎ్‌సఐర్-నీరీ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసిన టపాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. టపాసుల్లో వినియోగించిన ముడిపదార్థాలు, తయారీ సంస్థ అనుమతుల సర్టిఫికెట్ల వివరాలతో ఆ బాక్స్‌లపై క్యూర్ కోడ్‌లు ముద్రించాలని చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి