ఆమె అభిరుచి... అ‘చెంచ’లం
ABN , Publish Date - Jul 05 , 2026 | 01:47 PM
ఎవరి ఇంట్లోనైనా ఎన్ని స్పూన్లుంటాయి? ఐదో, పదో... మహా అయితే పాతిక... అంతే కదా! కానీ ఆమె ఇంట్లోకి వెళితే... ఇంటి నిండా చెంచాలే కనిపిస్తాయి.
ఎవరి ఇంట్లోనైనా ఎన్ని స్పూన్లుంటాయి? ఐదో, పదో... మహా అయితే పాతిక... అంతే కదా! కానీ ఆమె ఇంట్లోకి వెళితే... ఇంటి నిండా చెంచాలే కనిపిస్తాయి. ఏకంగా 38 వేల పైచిలుకు సేకరించి... ఇంటినే మ్యూజియంగా మార్చింది. ఎందుకలా?...
అమెరికాలోని అయోవాలో కామెలియా ఆర్ పోల్ అనే ఒక పెద్దావిడ ఉంది. చిన్నతనంలో ఆర్మీ ప్రాథమిక శిక్షణకు వెళ్లే ముందు ఆమె ముత్తవ్వ ఒక పురాతన వెండి పాత్రల సెట్‌ను బహుమతిగా ఇచ్చిందట. ఆ వెండి మెరుపులు ఆమెకు ఎంతో నచ్చాయి. అప్పటిదాకా స్టీల్, ప్లాస్టిక్, సిరామిక్, చెక్క చెంచాలను చూసిన ఆ చిన్నారి కళ్లకు అవి కొత్తగా కనిపించాయి. దాంతో కొత్తగా కనిపించే చెంచాలను సేకరించడం అభిరుచిగా ప్రారంభ మైంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ... ఆ అభిరుచే ఆమెను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కేలా చేసింది.
అనేక సంప్రదాయాలకు గుర్తుగా...
కామెలియాకు చెంచాల పట్ల ఆసక్తి ఏర్పడడానికి ప్రధాన కారణం... చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతలే! వెల్ష్ సంప్రదాయంలో స్పూన్లను ఒక చెక్క ముక్క నుంచి చెక్కి... వాటికి ప్రత్యేకమైన చిహ్నాలను చెక్కుతారట. వాటినే నూతన వధూవరులకు బహుమతిగా ఇస్తారు కూడా. కొన్ని సంప్రదాయాల్లో పిల్లలు పుట్టినప్పుడు స్పూన్లను పంచుతారట. అలాగే కొత్త ఇంట్లోకి మారినప్పుడు కొనే వస్తువుల్లో... కత్తులు, చెంచాలు వంటివే ఉంటాయి. కాబట్టి వాటినే సేకరించాలని భావించింది కామెలియా.
కాలక్రమంలో ఆమె అమెరికాలోని ఇతర ప్రాంతాలతో పాటు, అనేక దేశాల్లో పర్యటించింది. ఎక్కడికెళ్లినా ఆమె దృష్టి విభిన్నమైన చెంచాలపైనే ఉండేది. ఆ విధంగా వేల సంఖ్యలో అరుదైన, విశిష్టమైన చెంచాలను సేకరించింది. ఆమె విభిన్న ఆసక్తి ఫలితంగా 38,162 చెంచాలను ఇప్పటిదాకా సేకరించింది. ఇది ఆమెకు మిసీసీపీ స్పూన్ గ్యాలరీని స్థాపించడానికి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నామినేషన్‌ను సంపాదించడానికి వీలు కల్పించింది.
అరుదైన స్పూన్లు...
తను సేకరించిన చెంచాలతో కామెలియా ఇంటినే మ్యూజియంగా మార్చారు. ఆమె సేకరణలో క్వీన్ విక్టోరియా కాలం నాటి చెంచాలు, నోరిటకే డిజైన్లతో చేతితో తయారు చేసినవి, ఫ్రాంజ్ పింగాణితో చేసిన సెట్లు ఉన్నాయి. ఫ్రాంజ్ పింగాణితో చేసిన సెట్లు ధగధగా మెరుస్తూ సందర్శకులను ఆకర్షిస్తాయి. ఇవేకాకుండా ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, నార్వే, కొరియా వంటి దేశాల నుంచి కూడా ఆమె చెంచాలను సేకరించింది. ఆస్ట్రియా, ఈజిప్ట్, రష్యా కళాకారులు సృష్టించిన 100కు పైగా ప్లిక్ - ఎ- జౌర్ చెంచాలు మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News