టెస్టు రిటైర్‌మెంట్.. కోహ్లీ కోపంలో తీసుకున్న నిర్ణయం: కపిల్ దేవ్
ABN , Publish Date - Jul 05 , 2026 | 01:22 PM
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో విరాట్ టెస్టు రిటైర్‌మెంట్ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎన్నో మార్పులు జరిగాయని, ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దానిపై కోహ్లీ అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పటికే ఎంతో ఫిట్‌గా ఉన్న విరాట్.. తిరిగి టెస్టుల్లోకి రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ టెస్టు రిటైర్‌మెంట్ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘కోహ్లీకి ఇంకా టెస్టు క్రికెట్‌లో ఆడే సామర్థ్యం ఉంది. కానీ ఎందుకు ఆ ఫార్మాట్‌ను అనూహ్యంగా వీడాల్సి వచ్చిందో నాకర్థం కాలేదు. ఇక్కడ 10 వేల పరుగుల విషయం కాదు. విరాట్ ఇంకా క్రికెట్ ఆడగలడు. కానీ అది కోపంలో తీసుకున్న నిర్ణయమేమో అని నాకు అనిపించింది. ఆట విషయంలో ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకూడదు. సెలక్టర్లు ఎంపిక చేయకపోయినా సమస్య లేదు. కాస్త విరామం తీసుకుని తిరిగి రాణించాలి. మోహిందర్ అమర్‌నాథ్, అన్షుమాన్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు అదే చేశారు. కోహ్లీ టెస్టు క్రికెట్ రిటైర్‌మెంట్ నిర్ణయం నాకు నిరాశ కలిగించింది’ అని కపిల్ దేవ్ వెల్లడించాడు.
అగ్రెషన్ ఎక్కువ..
కోహ్లీ ఆటతీరుపై కూడా కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని అగ్రెషన్‌ను చూస్తుంటే అమెరికా టెన్నిస్ దిగ్గజం జాన్ మెక్‌ఎన్రోను గుర్తు చేస్తుందని అన్నారు. ‘విరాట్‌కు ఆవేశం ఎక్కువ. గేమ్ ఆడుతున్న సేపు ఎగ్జైట్ అవుతాడు. కానీ అతని ఆటను చూస్తే జాన్ మెక్‌ఎన్రో గుర్తొస్తాడు. అతడు కూడా ఒత్తిడిలోనే ఎక్కువగా రాణిస్తాడు. అగ్రెషన్ లేకుండా తన అత్యుత్తమ ఆట ఆడలేడు. నేను మాత్రం అలా కాదు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్ వంటి ప్లేయర్లు ప్రశాంతంగా ఆడేవారు. కానీ కోహ్లీ మాత్రం తన ఆవేశాన్నే ఆయుధంగా మార్చుకుని ఆడుతాడు” అని కపిల్ దేవ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
అందరికీ రుణపడి ఉంటా.. అరంగేట్రం తర్వాత వైభవ్ ఎమోషనల్ పోస్ట్
ఫిఫా ప్రపంచ కప్‌లో వివాదం.. ఎంబాపెపై బంతిని విసిరిన పరాగ్వే ప్లేయర్