‘స్పై మ్యూజియం’...అన్నీ ఆశ్చర్యాలే!
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:51 AM
గూఢచారి సినిమాలంటే ఇష్టపడని వారుండరు. అందులో హీరో ఉపయోగించే కారు నుంచి... పెన్ను దాకా... అన్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
గూఢచారి సినిమాలంటే ఇష్టపడని వారుండరు. అందులో హీరో ఉపయోగించే కారు నుంచి... పెన్ను దాకా... అన్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఆర్మీలో ఉపయోగించే నిఘా పరికరాలు అంతకుమించి ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన ‘స్పై’ వస్తువులు ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ‘ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం’లోకి అడుగు పెడితే అన్నీ అద్భుతాలే...
జేమ్స్‌బాండ్ ధరించిన చేతిగడియారం. చూడటానికి మామూలు గడియారంలానే ఉంటుంది. కానీ అందులో రహస్య కెమెరా ఉంటుంది. సిగరెట్ వెలిగించే లైటర్... అవసరమైనప్పుడు తుపాకీగా మారుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గూఢచారులు ఉపయోగించిన పరికరాలు బోలెడున్నాయి. సినిమాల్లో జేమ్స్‌బాండ్ మాత్రమే కాదు... యుద్ధంలో సైన్యం సైతం శత్రువుల కదలికలు గమనించేందుకు రహస్య పరికరాలను ఉపయోగిస్తుంది. అలాంటి వస్తువులను ఒక చోట చేర్చి ‘ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం’గా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
వాషింగ్టన్‌లోని ఈ మ్యూజియంలో ప్రతీ వస్తువు ఆసక్తికరమే. చిన్న చిన్న రహస్య కెమెరాలు, కనిపించని సిరాతో రాసిన ఉత్తరాలు, రహస్య సంకేతాలను ఛేదించే యంత్రాలు, నకిలీ కరెన్సీ, మారు వేషాల కోసం ఉపయోగించిన వస్తువులు, రహస్య ఆయుధాలు... ఇలా ఎన్నో అరుదైన వస్తువులు అక్కడ ఉన్నాయి. 1950 నుంచి గూఢచర్యానికి వాడిన అనేక రకాల వస్తువులను ఈ మ్యూజియంలో చూడవచ్చు. ప్రపంచ చరిత్రలో గూఢచారులు పోషించిన పాత్రను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
రహస్య ఉత్తరం
మ్యూజియంలోని అత్యంత పురాతన వస్తువుల్లో అదృశ్య సిరాతో రాసిన ఉత్తరం ఒకటి. ఈ ఉత్తరం అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్‌కు సంబంధించినదిగా మ్యూజియం లోని ప్రదర్శనలో చూపిస్తారు. ఈ ఉత్తరాన్ని చూస్తే రహస్య సమాచారాన్ని ఎలా పంపించేవారో అర్థమవుతుంది.
పావురమే డ్రోన్
ఇప్పుడంటే డ్రోన్‌లున్నాయి. కానీ ఒకప్పుడు పావురానికి కెమెరా అమర్చి ఫొటోలు తీసేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అలా తీసిన ఫొటోలను మ్యూజియంలో చూడొచ్చు. పావురం శరీరానికి అమర్చిన చిన్న కెమెరాతో తీసిన ఫొటోలో దాని రెక్కల అంచులు కూడా కనిపిస్తాయి.
షూతో నిఘా...
యూరప్‌లోని ఒక దేశంలో పనిచేస్తున్న అమెరికా దౌత్యవేత్త తన షూ మరమ్మతు కోసం చెప్పులు కుట్టే వ్యక్తికి ఇచ్చాడు. ఆ షూ హీల్ భాగాన్ని చూసిన దౌత్యవేత్త ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. అతనికి తెలియకుండా ఆ దేశ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ షూలో ఒక రహస్య మైక్రోఫోన్, ట్రాన్స్‌మీటర్ అమర్చారు. ఒక దౌత్యవేత్త వేసుకున్న షూని అతనిపై నిఘా పెట్టే పరికరంగా మార్చేశారు!
‘రెక్టల్ టూల్ కిట్’
గూఢచారి పట్టుబడితే తప్పించుకోవడానికి ఉపయోగపడే చిన్న చిన్న పరికరాలను ఒక ప్రత్యేక కిట్‌లో ఉంచేవారు. ఇందులో డ్రిల్ బిట్లు, చిన్న రంపాలు, కత్తులు వంటి పరికరాలు ఉండేవి. అది కూడా మ్యూజియంలో చూడొచ్చు.
గ్లోవ్ పిస్టల్
చేతికి ధరించిన గ్లౌజ్‌లోనే తుపాకీ అమరి ఉంటుంది. దీన్ని గ్లోవ్ పిస్టల్ అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆయుధం చేతిలో ఉన్నప్పటికీ ఎవరికీ కనిపించదు. రెండు చేతులతో సాధారణ పనులు చేసే అవకాశం ఉంటుంది.
కళ్లజోడే కానీ....
గూఢచారులు శత్రువుల చేతికి చిక్కితే నరకం చూడాల్సి ఉంటుంది. దానికంటే చనిపోవడం నయం. అలాంటి పరిస్థితుల్లో ఉపయోగించేందుకు విషపూరిత మాత్రను దాచిన ప్రత్యేక కళ్లజోడు తయారు చేశారు. కళ్లజోడు కడ్డీలో చిన్న సైనైడ్ మాత్ర ఉంటుంది. పట్టుబడిన వ్యక్తి అనుమానం రాకుండా కళ్లజోడు కడ్డీని నమలడం ద్వారా ఆ విషాన్ని తీసుకునేలా పరికరాన్ని రూపొందించారు. అలాగే పాయిజన్ పెన్‌చూస్తే ఇది ఒక సాధారణ పెన్‌లానే కనిపిస్తుంది. కానీ దాని లోపల విషపూరిత సూది ఉంటుంది. పెన్ పైభాగాన్ని కొన్నిసార్లు తిప్పి, ఆ తర్వాత కిందికి నొక్కితే సూది బయటకు వచ్చేలా ఉంటుంది. ఈ సూది ద్వారా విషం శరీరంలోకి వెళ్లి కండరాల పక్షవాతానికి దారితీసి, చివరకు శ్వాస అందక మరణిస్తారు.
సల్మాన్ సినిమా పోస్టర్
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వివిధ గూఢచర్య సినిమాల పోస్టర్లకు కూడా స్పై మ్యూజియంలో చోటు కల్పించారు. వాటిలో సల్మాన్‌ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ సినిమా పోస్టర్ ఉండటం విశేషం. భారతదేశం నుంచి ఆ అవకాశాన్ని పొందిన ఏకైక చిత్రం ఇది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News