వారి సాహసం... స్ఫూర్తిదాయకం!
ABN , Publish Date - Oct 04 , 2026 | 08:55 AM
ఇటీవల తీస్తా నదిలో ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోతున్న ఒక గున్న ఏనుగు... స్థానిక మత్స్యకారుల సాహసంతో బతికి బయటపడింది.
ఇటీవల తీస్తా నదిలో ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోతున్న ఒక గున్న ఏనుగు... స్థానిక మత్స్యకారుల సాహసంతో బతికి బయటపడింది. చివరికి తల్లి ఏనుగు ఒడికి చేరుకుంది. మనిషి- వన్యప్రాణుల మధ్య సహజ అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ సంఘటన... దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. మత్య్సకారుల సాహసానికి సోషల్‌మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా గజోల్‌డోబా గ్రామం. దాని పరిసరాల్లో ఉప్పొంగి ప్రవహిస్తోంది తీస్తా నది. ఓ ఏనుగుల గుంపు ఆ నదిని దాటుతోంది. వాటిలో కేవలం 3-4 రోజుల వయసున్న ఏనుగు పిల్ల గుంపు నుంచి విడిపోయింది. అంతేకాదు, ప్రవాహ ఉద్ధృతికి దిగువకు కొట్టుకుపోతోంది. తొండం మాత్రమే పైకి కనిపిస్తూ.. నీళ్లలో దాదాపు మునిగిపోయే స్థితికి చేరుకుంది. నదిలో చేపలు పడుతున్న స్థానిక మత్స్యకారులు దానిని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. పిల్ల ఏనుగును ఎలాగైనా కాపాడాలనుకుని, కార్యరంగంలోకి దూకారు.
తమ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ... చిన్న పడవలను ఏనుగు పిల్ల వైపు మళ్లించారు. బలమైన ప్రవాహం దాన్ని మరింత దూరం తీసుకువెళ్తోంది. ఐదుగురు మత్స్యకారులు రెండు పడవల్లో దాదాపు 3 కిలోమీటర్ల దూరం దానితోనే వెళ్లారు. ప్రవాహదిశకు ఎదురుగా పడవలు నడిపారు. ఇద్దరు వీలైనంత వేగంగా ఏనుగు పిల్లను చేరుకున్నారు. అప్పటికే అది బాగా అలసిపోయింది. దాన్ని పట్టుకుని పడవలోకి జాగ్రత్తగా లాగారు. ఓ జీవిని కాపాడగలిగామనే సంతృప్తితో దాన్ని సంతోషంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత పడవ నడుపుతూ తీరం వైపు సాగారు. గున్న ఏనుగును పడవ నుంచి బయటకు లాగి ఒడ్డుకు చేర్చారు. సెప్టెంబర్ 21 ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇదంతా జరిగింది. ఈ సాహసికులు నార్త్ బెంగాల్ ఫిషర్‌మెన్స్ ఫోరమ్ సభ్యులు.
అటవీశాఖ రంగంలోకి...
ఈ కథ ఇక్కడితో ముగియలేదు. అది తల్లి నుంచి విడిపోయిన నవజాత శిశు గజం కదా? దాన్ని మనుషుల దగ్గర ఉంచడం సరైన పరిష్కారం కాదు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇస్తే వాళ్లు వచ్చారు. దాన్ని వెంటనే కాతంబరి రేంజ్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడే దానికి అవసరమైన పశువైద్య సంరక్షణ అందించారు. తర్వాత వారు దాని తల్లికోసం వెతకడం ప్రారంభిం చారు. బ్యారేజ్‌ని దాటిన తర్వాత ఏనుగుల గుంపు తీస్తా నదీ గర్భంలోని ఎండిపోయిన ప్రాంతంవైపు వెళ్లిందని గుర్తించారు. అక్కడే తల్లీబిడ్డలను తిరిగి కలి పేందుకు ఏర్పాట్లు చేశారు.
తల్లి ఏనుగు ఉన్న ప్రదేశానికి సుశిక్షితులైన సిబ్బంది ఏనుగు పిల్లను మోసుకు పోతుంటే.. అది కంగారుగా అరవడం మొదలుపెట్టింది. సిబ్బంది పట్టువీడ కుండా దాన్ని తల్లికి కొంత దూరంలో వదిలిపెట్టారు. తన గున్నను చూడగానే తల్లి ఏనుగు పరుగున దాన్ని చేరుకుంది. రెండూ సంతోషంతో తలమునకలయ్యాయి. నదిలో కొట్టుకుపోయి, బతికొచ్చిన తన పిల్ల ఏనుగుకు తల్లి వెంటనే పాలిచ్చింది. పాలు పట్టడం అనేది తల్లి ఆ పిల్లను తిరిగి స్వీకరించిందనడానికి తక్షణ సూచన. తర్వాత ఆ రెండూ అడవిలోకి వెళ్లిపోయాయి.
ఎందుకు ప్రత్యేకం?
సాధారణ చర్య కాదు: నదీ ప్రవాహంలో చిన్న పడవలతో 3 కిలోమీటర్ల దూరం వెంబడించి, బరువైన ఏనుగు పిల్లను పడవలోకి ఎక్కించడం ప్రమాదకరమైన సాహసం. ఏమాత్రం వెరవకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవి రక్షణకు మత్స్యకారులు వేగంగా కదలడం విశేషం.
తల్లీబిడ్డల బంధం: తల్లి ఏనుగును గుర్తించి దానితో తిరిగి కలపడం ఈ రెస్క్యూ ఆపరేషన్లోని కీలకాంశం. వన్యప్రాణి సంరక్షణలో కాపాడటం, పునరావాసం, తల్లితో/గుంపుతో కలపడం అనేవి ముఖ్యం.
స్థానిక సమాజమూ భాగస్వామే: ఇక్కడ మొదటి స్పందన అటవీ శాఖ నుంచి కాదు, నదిలో ఉన్న మత్స్యకారుల నుంచి వచ్చింది. అడవులూ, నదులూ ఉన్న ప్రాంతాల్లో నివసించే స్థానికులకు తమ పరిసరాలపై ఉండే పరిజ్ఞానం, అప్రమత్తత చాలా సందర్భాల్లో కీలకంగా మారుతుందని రుజువైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News