Share News

వర్షాకాలంలో ఈ వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెడుతున్నారా.? అయితే జాగ్రత్త!

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:03 PM

వానాకాలంలో కొన్ని గృహోపకరణాలను ఎక్కడపడితే అక్కడ పెడితే పాడైపోతాయి. ఈ సమయంలో ఏ వస్తువులను ఎక్కడ పెట్టాలో ఓసారి తెలుసుకుందాం..

వర్షాకాలంలో ఈ వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెడుతున్నారా.? అయితే జాగ్రత్త!

ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో గాలిలో తేమ కారణంగా చాలా గృహోపకరణాలు త్వరగా పాడైపోతాయి. ఇలాంటి సమయంలో ఆయా వస్తువులను సరైన ప్రదేశంలో, సరైన పద్ధతిలో ఉంచకపోతే వాటి మన్నిక తగ్గిపోతుంది. ఎలాంటి వస్తువులను ఎక్కడెక్కడ నిల్వ చేయాలంటే...


వుడ్ సంబంధిత వస్తువులు

వుడ్ ఫర్నిచర్, తలుపులు లాంటి వాటిపై గాలిలోని తేమ తీవ్ర ప్రభావం చూపుతుంది. తేమను పీల్చుకోవడం వల్ల చెక్క వస్తువులు ఉబ్బిపోవచ్చు. అలాగే బూజు కూడా పట్టవచ్చు. దీనివల్ల తలుపులు మూసుకోకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే అధిక తేమ ఉన్న ప్రదేశంలో చెక్క వస్తువులు పెట్టకూడదు. అలాగే ఫర్నిచర్‌ను నేరుగా గోడకు ఆనించి పెట్టడానికి బదులుగా కొంత ఖాళీ స్థలం వదిలేయడం మంచిది.

ఐరన్ వస్తువులు

వర్షాకాలంలో ఐరన్ వస్తువులపైనా ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక తేమ కారణంగా ఇనుప ఉపరితలాలపై పలుచని నీటి పొర ఏర్పడుతుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగితే వస్తువులు తుప్పు పడతాయి. కాబట్టి ఇనుప వస్తువులను పొడి ప్రదేశాల్లో ఉంచాలి. ఏదైనా వస్తువుపై నీరు పడితే.. దాన్ని వెంటనే ఆరబెట్టాలి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా తప్పు ముప్పును ఎదుర్కోక తప్పదు.


వంట పదార్థాలు

వానాకాలంలో వంటగదిలో నిల్వ ఉంచే మసాలాలు, పిండి, రవ్వ లాంటి పదార్థాలూ ప్రభావితమవుతాయి. గాలిలోని తేమ వల్ల ఆ పదార్థాలు ముద్దగా మారే అవకాశముంది. ఒక్కోసారి అవి పాడవుతాయి కూడా. అందువల్ల అలాంటి వాటిని ఎప్పుడూ పొడిగా ఉన్న, గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. వీటిని ఉపయోగించేటప్పుడు కూడా తడి చెంచాను వాడకూడదు.

బట్టలు, పరుపులు

వర్షాకాలంలో బట్టలు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ పూర్తిగా ఆరకుండానే బీరువాలో పెడితే.. అవి బూజు పట్టి వాసన వస్తాయి. అలాగే గదిలోకి సరిపడా గాలి రాకపోతే పరుపులు, దిండ్ల నుంచి దుర్వాసన వచ్చే అవకాశముంది. అందువల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు సక్రమంగా వచ్చేలా చూసుకోవాలి.

ఎలక్ట్రానిక్ వస్తువులు

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, టీవీలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను నేరుగా తేమ, నీరు తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. ముఖ్యంగా ఈ వస్తువులను కిటికీలు, బాల్కనీల దగ్గర లేదా వర్షపు నీటి తుంపరలు పడే చోట పెట్టరాదు.


ఈ వార్తలూ చదవండి:

గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లను దూరం చేసే వెల్లుల్లి..

వాషింగ్ మెషీన్‌లో ఉతికిన దుస్తులపై మరకలు పడుతున్నాయా.?

Updated Date - Sep 13 , 2026 | 02:57 PM