వాషింగ్ మెషీన్‌లో ఉతికిన దుస్తులపై మరకలు పడుతున్నాయా.? అయితే ఈ తప్పులు చేయకండి..
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:55 AM
వాషింగ్ మెషీన్‌లో వేసిన బట్టలపై మరకలు పడుతున్నాయా? కొత్త వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా.? ఆ అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారీ సమస్య యంత్రంలోనే ఉండదు.
ఇంటర్నెట్ డెస్క్: కొన్నిసార్లు వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికిన తరువాత పాత మరకల సంగతి అటుంచితే కొత్త మరకలు ఏర్పడతాయి. అలాంటి సమయాల్లో ‘ఛీ.. ఈ వాషింగ్ మెషీన్ పనిచేయట్లేదు’ అని తిట్టుకుంటారు కొందరు. అయితే నిజానికి ఈ మరకలు రావడానికి అన్ని వేళలా యంత్రంలోని లోపమే కారణం కాదు. వాషింగ్ మెషీన్ వాడే విధానంలోని లోపాలూ దుస్తులపై మరకలు పడేలా చేస్తాయి. ముఖ్యంగా డిటర్జెంట్ కారణంగా ఇలాంటి మరకలు పడతాయి. తడిగా ఉన్నప్పుడు కంటే బట్టలు ఆరిన తరువాతే ఇవి ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే కింది సూచనలు పాటించి మీ దుస్తులపై మరకలు పడకుండా నివారించండి.
సరైన వాష్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవాలి
అన్ని రకాల దుస్తులకు ఒకే వాష్ ప్రోగ్రామ్ సరిపోదు. రకాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి దీన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు కాటన్ దుస్తులకు కాటన్ మోడ్‌ను, జీన్స్ లాంటి మందపాటి బట్టలకు హెవీ డ్యూటీ ప్రోగ్రామ్‌ను ఉపయోగించాలి. అలాగే తక్కువ మురికిగా ఉన్న దుస్తుల కోసం క్విక్ వాష్ ఎంచుకోవాలి. తప్పుడు ప్రోగ్రామ్ వల్ల యంత్రం బట్టలను సరిగా శుభ్రం చేయదు. అందుకే డిటర్జెంట్ మరకలు మిగిలిపోతాయి

డిటర్జెంట్ మరీ ఎక్కువగా వాడొద్దు..
ఎక్కువ డిటర్జెంట్ వేస్తే దుస్తులు బాగా శుభ్రమవుతాయని చాలామందికి అపోహ ఉంటుంది. కానీ అలా వేయడం వల్ల బట్టలు పాడవుతాయి. ఎక్కువ మోతాదులో ఉన్న డిటర్జెంట్ మరకల రూపంలో దుస్తులకు అంటుకుపోతుంది. కాబట్టి అవసరానికి తగ్గట్టే డిటర్జెంట్‌ను కలపండి.
పదేపదే డిటర్జెంట్ మరకలు పడుతుంటే, ముందుగా డిటర్జెంట్ పరిమాణం, బట్టల లోడింగ్, మెషీన్ సెట్టింగ్ వంటివి చెక్ చేయండి.

తరచూ యంత్రాన్ని శుభ్రం చేయండి..
యంత్రాన్ని మీరు సరిగా శుభ్రం చేయకపోతే.. బట్టలను అది నీట్‌గా శుభ్రం చేయదు. డిటర్జెంట్ ట్రేలో పేరుకుపోయిన పొడి, ద్రవ అవశేషాలు దుస్తులపై మరకలకు కారణమవుతాయి. అందుకే యంత్రాన్ని తరచూ శుభ్రం చేయండి. అదేవిధంగా కంపెనీ శుభ్రపరచమని సలహా ఇచ్చిన యంత్ర భాగాలను క్రమం తప్పకుండా శుభ్రపరచండి.

ఈ వార్తలు కూడా చదవండి:
ఫ్రిజ్‌లో పెట్టినా పాలు విరిగిపోతున్నాయా? ఈ పొరపాటు చేయకండి
ప్లాస్టిక్ కుర్చీలను శుభ్రం చేయడానికి బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే