Share News

ఫ్రిజ్‌లో పెట్టినా పాలు విరిగిపోతున్నాయా? ఈ పొరపాటు చేయకండి

ABN , Publish Date - Sep 05 , 2026 | 05:42 PM

ఫ్రిజ్‌లో పెట్టినా పాలు త్వరగా విరిగిపోతున్నాయా? పాలను ఎక్కడ, ఎలా నిల్వ చేస్తున్నామన్నది వాటి తాజాదనంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఫ్రిజ్ డోర్‌లో పాలను పెట్టడం వల్ల ఉష్ణోగ్రత మార్పులకు గురై త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

 ఫ్రిజ్‌లో పెట్టినా పాలు విరిగిపోతున్నాయా? ఈ పొరపాటు చేయకండి
Milk Storage Tips

ఇంటర్నెట్ డెస్క్: పాలు త్వరగా పాడవకుండా ఉండేందుకు మనం వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తాం. అయితే ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత కూడా కొన్నిసార్లు పాలు త్వరగా విరిగిపోతాయి. దీనికి కేవలం పాల నాణ్యత లేదా ఫ్రిజ్ సమస్య మాత్రమే కారణం కాదు. పాలను ఫ్రిజ్‌లో ఎక్కడ పెడుతున్నాం, ఎంతసేపు బయట ఉంచుతున్నాం వంటి మన రోజువారీ అలవాట్లు కూడా పాల తాజాదనంపై ప్రభావం చూపుతాయి.

ఫ్రిజ్‌లోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ చల్లగా ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రిజ్ డోర్‌ను తరచూ తెరిచి మూసేస్తుండటంతో అక్కడ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి.


ఫ్రిజ్ డోర్‌లో పాలు పెట్టకండి

పాల ప్యాకెట్ లేదా సీసాను ఫ్రిజ్ డోర్‌లో పెట్టడం సులభంగా అనిపిస్తుంది. కానీ పాలను నిల్వ చేయడానికి అది సరైన ప్రదేశం కాదు. డోర్‌ను పదేపదే తెరవడం, మూసేయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత తరచూ మారుతూ ఉంటుంది. దీనివల్ల పాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పాలను ఫ్రిజ్ డోర్‌లో కాకుండా లోపలి అరల్లో పెట్టడం మంచిది. ముఖ్యంగా మధ్య లేదా కింది అరల్లో ఉంచితే పాలు చల్లగా, స్థిరమైన ఉష్ణోగ్రతలో ఉంటాయి.

పాలను ఎక్కువసేపు బయట ఉంచకండి

పాలను సరైన ప్రదేశంలో పెట్టడం మాత్రమే కాదు.. వాటిని బయట ఎంతసేపు ఉంచుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు ఉదయం టీ లేదా అల్పాహారం కోసం పాలను బయటకు తీసి, చాలా సేపటి తర్వాత తిరిగి ఫ్రిజ్‌లో పెడితే అవి గది ఉష్ణోగ్రతకు గురవుతాయి. వెచ్చని వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉండటంతో పాలు త్వరగా పాడవుతాయి. అందువల్ల అవసరమైనంత పాలను మాత్రమే బయటకు తీసుకోవాలి. మిగిలిన పాలను వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

గ్యాస్‌, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి

నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!

Updated Date - Sep 05 , 2026 | 05:43 PM