నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:58 PM
చల్లని వాతావరణంలోనూ రాత్రిపూట నిద్రలో విపరీతంగా చెమట పడుతోందా? అయితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. థైరాయిడ్, ఒత్తిడి, మెనోపాజ్ వంటి పలు కారణాలతో ఇలా జరగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాత్రిపూట నిద్రలో చెమట పట్టడం చాలామందిలో కనిపించే సమస్యే. గది వేడిగా ఉండటం, ఎక్కువ దుప్పట్లు కప్పుకోవడం లేదా రోజంతా శారీరక శ్రమ చేయడం వల్ల చెమట పట్టడం సాధారణమే. కానీ వాతావరణం చల్లగా ఉన్నా.. ఫ్యాన్, ఏసీ పనిచేస్తున్నా నిద్రలో పదేపదే విపరీతంగా చెమట పడుతుంటే మాత్రం కారణాన్ని తెలుసుకోవడం అవసరం. కొన్ని సందర్భాల్లో ఇది శరీరంలో జరుగుతున్న మార్పులకు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ సమస్య ఉండొచ్చు
థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అవసరానికి మించి చురుగ్గా పనిచేస్తే హైపర్‌థైరాయిడిజం సమస్య వస్తుంది. ఈ పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రతను తట్టుకోవడం కష్టంగా మారి ఎక్కువగా చెమట పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో చెమటలు పట్టడం కూడా ఈ సమస్య లక్షణాల్లో ఒకటిగా ఉండొచ్చు.
ఒత్తిడి, ఆందోళన కూడా కారణమే
ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగం పెరగడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలతో పాటు చెమట కూడా పట్టవచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో నిద్రలోనూ చెమటలు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మెనోపాజ్ సమయంలో
ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళల్లో రాత్రిపూట అకస్మాత్తుగా చెమటలు పట్టడం కనిపిస్తే మెనోపాజ్ దశకు సంబంధించిన మార్పులు కూడా కారణం కావచ్చు. ఈ సమయంలో ముఖం, మెడ, ఛాతి ప్రాంతాల్లో ఒక్కసారిగా వేడి అనిపించడం, ఆ వెంటనే చెమట పట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
కొన్ని మందులతోనూ చెమటలు
కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కూడా రాత్రిపూట చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని యాంటీడిప్రెసెంట్లు, మధుమేహానికి ఉపయోగించే మందులు, స్టెరాయిడ్లు, ఎసిటామినోఫెన్, ఆస్పిరిన్, రక్తపోటు మందులు ఇందుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మందులు వాడుతున్న తర్వాతే ఈ సమస్య మొదలైతే వైద్యులని సంప్రదించి వివరాలు చెప్పాలి.
ఈ జాగ్రత్తలు పాటించండి
రాత్రిపూట చెమటలు తగ్గించుకోవడానికి పడుకునే గదిని చల్లగా, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్, ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం ఉపయోగపడవచ్చు.
మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు కూడా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవడం, పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా నిర్వహించుకోవచ్చు.
ఏదైనా మందు వాడిన తర్వాతే రాత్రిపూట చెమటలు పడుతున్నట్లు అనిపిస్తే.. ఆ మందును స్వయంగా ఆపకుండా వైద్యులని సంప్రదించాలి. అవసరమైతే ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయా అనే విషయాన్ని వైద్యులని అడిగి తెలుసుకోవాలి.
అలాగే ఒత్తిడి, ఆందోళన తగ్గించుకునేందుకు రోజువారీ జీవితంలో నచ్చిన పనులకు సమయం కేటాయించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం కూడా సహాయపడుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు