చాలా కాలంగా ట్రాఫిక్ చలాన్లు కట్టడం లేదా..? అయితే జాగ్రత్త
ABN , Publish Date - Oct 01 , 2026 | 07:44 PM
చాలా కాలంగా ట్రాఫిక్ చలాన్లు చెల్లించడం లేదా..? అయితే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా చాలా మంది ట్రాఫిక్ చలాన్లను చెల్లించడం లేదు. దీర్ఘకాలంగా వాటిని పెండింగ్‌లో పెడుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు రూ.45 వేల కోట్ల ఈ-చలాన్లు జారీ కాగా, అందులో రూ.25 వేల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రూ.20,000 కోట్ల చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ అంశం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. ఒక కేసు విచారణ సందర్భంగా ఈ డేటాను కోర్టుకు సమర్పించారు. దీనిపై స్పందించిన కోర్టు చాలామంది ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడం లేదని సీరియస్ అయింది. చలాన్లు వసూలు చేయడానికి కొన్ని మార్గాలను కూడా సూచించింది. అవి ఎంటంటే..?
కరెంటు బిల్లులోనే చలాన్లు : చలాన్ల వసూలుకు సుప్రీం కోర్టు ఒక కొత్త పద్ధతిని సూచించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న చలాన్ మొత్తాన్ని బకాయిదారుడి ఇంటి విద్యుత్ బిల్లుకు జోడించాలని తెలిపింది. అంటే కరెంట్ బిల్లులోనే చలాన్ ఉంటుందన్నమాట.
ఆర్సీపై నిషేధం : బకాయి చలాన్లు ఉన్న వాహనాల ఆర్సీ ( రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) పై నిషేధం విధించాలని చెప్పింది.
ఫిట్‌నెస్ సర్టిఫికేట్: దీర్ఘకాలంగా ట్రాఫిక్ జరిమానా చెల్లించకుంటే వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయకూడదని సూచించింది. అదేవిధంగా అలాంటి వాహనాలకు పీయూసీ (కాలుష్య ధృవీకరణ పత్రం) జారీని నిలిపివేస్తే బకాయి చలాన్లు వసూలయ్యే అవకాశముందని పేర్కొంది.
లైసెన్స్ నిలిపివేత: పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారుల లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియను నిలివేయాలని సూచనలు చేసింది.
అయితే ఈ సూచనలు అమల్లోకి వస్తే వాహనదారులు సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. అందుకే పెండింగ్ చలాన్లను చెల్లించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ చెకింగ్ డ్రైవ్.. ప్రయాణికులు ఈ పత్రాలను వెంట ఉంచుకోవాల్సిందే!
మీ బైక్ మైలేజీ తగ్గుతోందా..? అయితే ఈ తప్పులు చేయకండి!