పాత గీజర్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త
ABN , Publish Date - Oct 03 , 2026 | 07:15 PM
కొందరు పాత గీజర్లను సరైన తనిఖీ లేకుండా ఉపయోగిస్తుంటారు. ఇది ప్రమాదాలకు దారితీయవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో వర్షాకాలం ముగిసిందని, చలికాలం మొదలైందని తాజాగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. శీతకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎలక్ట్రిక్ గీజర్ల వాడకం గణనీయంగా పెరగనుంది. అయితే కొందరు పాత గీజర్లను సరైన తనిఖీ లేకుండా ఉపయోగిస్తుంటారు. ఇది ప్రమాదాలకు దారితీయవచ్చు.
గీజర్లను దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల వాటిలోని హీటింగ్ ఎలిమెంట్, థెర్మోస్టాట్, వైరింగ్ వంటి అంతర్గత భాగాలు దెబ్బతినవచ్చు. తేమ కారణంగా ఈ భాగాలకు తుప్పు పట్టే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ నేరుగా నీటిలోకి లేదా లోహపు భాగంలోకి ప్రవహిస్తుంది. అందుకే పాత గీజర్లను తనిఖీ చేయించడం చాలా ముఖ్యం.
హీటింగ్ ఎలిమెంట్స్: నీటిలో ఉండే లవణీయత కారణంగా పాత గీజర్‌లో హీటింగ్ ఎలిమెంట్‌కు పగుళ్లు రావడం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో ఎలిమెంట్ లోపలి తీగను నీరు తాకినప్పుడు షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉంది.
వైరింగ్ సమస్య: గీజర్‌ను నిరంతరం వాడడం వల్ల అందులోని వైర్ల ఇన్సులేషన్ (ప్లాస్టిక్ కవర్) కరిగిపోయి బలహీనపడుతుంది. ఈ వైర్‌లోని తీగలు ఒకదానికొకటి తగిలితే నిప్పురవ్వలు పుట్టి, అగ్నిప్రమాదం జరుగుతుంది.
థెర్మోస్టాట్‌లో లోపం: థెర్మోస్టాట్‌లో కాలక్రమేణా సామర్థ్యం తగ్గిపోతుంది. దీని వల్ల ఆటో కట్-ఆఫ్ పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు గీజర్ నీటిని వేడి చేస్తూనే ఉంటుంది. ఫలితంగా ఉష్ణోగ్రత భారీగా పెరిగి గీజర్ ట్యాంక్ పేలిపోతుంది.
ప్రమాదాలను నివారించాలంటే..
పాత గీజర్‌ను వాడేముందు దాని ఎర్తింగ్, వైరింగ్‌లను ఎలక్ట్రిషియన్‌తో తనిఖీ చేయించాలి.
ఎమ్‌సీబీ, ఆర్‌సీబీ స్విచ్‌లను ఉపయోగించాలి.
గీజర్ మరీ పాతదైతే దానిని కొత్త గీజర్‌తో మార్చాలి.
8 నుంచి 10 సంవత్సరాల పాత గీజర్‌ను వాడకపోవడమే మంచిది.
ఇవీ చదవండి
చాలా కాలంగా ట్రాఫిక్ చలాన్లు కట్టడం లేదా..? అయితే జాగ్రత్త
మీ బైక్ మైలేజీ తగ్గుతోందా..? అయితే ఈ తప్పులు చేయకండి!