Share News

నాన్నే నా బిగ్‌ సపోర్టర్‌...

ABN , Publish Date - Jun 21 , 2026 | 06:58 AM

నాన్నంటే ఒక ధైర్యం... ఒక నమ్మకం. నాన్న ప్రేమలో ఒక బాధ్యత కనిపిస్తుంది.

నాన్నే నా బిగ్‌ సపోర్టర్‌...
Anand Deverakonda

నాన్నంటే ఒక ధైర్యం... ఒక నమ్మకం. నాన్న ప్రేమలో ఒక బాధ్యత కనిపిస్తుంది. పిల్లలకు ఎప్పుడూ తండ్రే మొదటి హీరో. నాన్నే తమ ప్రపంచం అనుకునే అందరికీ హ్యాపీ ఫాదర్స్‌ డే. ఈ సందర్భంగా కొందరు స్టార్లకు తమ హీరో (తండ్రి)తో ఉన్న అనుబంధానికి అక్షరరూపం...

నాన్నే సపోర్టర్‌...

నాన్న పేరు గోవర్ధన్‌ రావు దేవరకొండ. ఆయన... విజయ్‌ (దేవరకొండ) యాక్టర్‌ అవుతాడని, నేను క్రీడాకారుడిని అవుతాననుకునేవారు. ఎందుకంటే నేను ఉదయం లేచిన దగ్గర నుంచి బ్యాట్‌ బాల్‌ పట్టుకొని తిరుగుతుండేవాడిని. నా కోసం గంటలకొద్దీ బౌలర్‌ అవతారం ఎత్తేవాడు నాన్న. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి ఇండియా వచ్చినప్పుడు కూడా నాన్నే నా బిగ్‌ సపోర్టర్‌. సినిమాల్లోకి వెళతానన్నప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. ఆయన దగ్గర నుంచి ఓర్పు, సహనం... ఏ పని చేసినా దాని నుంచి ఏమీ ఆశించకూడదని నేర్చుకున్నా. ఆయన కుటుంబానికి ప్రాధాన్యతనిస్తారు. ఒకసారి న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌లో నడుస్తుండగా నన్ను, విజయ్‌ని హగ్‌ చేసుకొని ‘నన్ను మీరు ఎక్కడో నిల బెట్టారు. చాలా గర్వంగా ఉంది’ అన్నారు. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను.

  • ఆనంద్‌ దేవరకొండ


చాలా కేరింగ్‌ పర్సన్‌...

book1.2.jpgఎవరేమనుకున్నా నన్ను నాలా ఉండమంటారు మా నాన్న రాజన్‌. చుట్టాలంతా ఆడపిల్లలకు ఇంటి పనులు నేర్పించండి... త్వరగా పెళ్లి చేసి పంపించాలంటూ పోరు పెడుతుంటారు. నాన్న ఆ మాటలేవీ పట్టించుకోరు. మీరు మీ కాళ్ల మీద నిలబడండి చాలు అంటుంటారు. ఆయన ఒక చిరుద్యోగి. అయినా ఉన్నదాంట్లోనే మాకు ఏ కష్టం రాకుండా, ముఖంపై చిరునవ్వు చెరగకుండా జాగ్రత్తగా, చాలా కేరింగ్‌గా చూసుకుంటారు.

- అనస్వర రాజన్‌


నిజ జీవితంలోనూ కింగ్‌

book1,2.jpgనా ధైర్యం నాన్న రూపంలో ఇంట్లోనే ఉంది. కొన్నిసార్లు నాన్న నాకు ఫ్రెండ్‌లా, గైడ్‌లా కనిపిస్తారు. మరికొన్నిసార్లు సోదరుడిలా తోడుంటారు. నా మెంటర్‌, గైడ్‌ అన్నీ తానే. నాన్న చాలా కూల్‌పర్సన్‌. ఆయనకి కోపం రావడం చాలా అరుదు. నాన్నలాగా కూల్‌గా ఉండలేను. కానీ మెల్లగా నేర్చుకుంటా. నాకు ఏం అనిపిస్తే అది చేయమని సలహా ఇస్తారు. స్వతంత్రంగా ఉండడం నేర్పించారు. నేను ఎదగడానికి అది చాలా ఉపయోగపడింది. ఆయన సినిమాల్లోనే కాదు... నిజ జీవితంలోనూ కింగే.

- అఖిల్‌ అక్కినేని


నేను నేర్చుకున్నది అదే...

book1.3.jpgమా నాన్న పేరే నా చివరి పేరు. అదేనండీ.. రంగనాథన్‌. ఆయన నా చిన్నప్పటి నుంచి జిరాక్స్‌ షాపు నడిపిస్తున్నారు. నన్ను ఐఏఎస్‌గా చూడాలనుకున్నారు. కానీ బీటెక్‌లో ఉన్నప్పుడు నాకు సినిమాపై ఇంట్రెస్ట్‌ పుట్టింది. కోమలి అనే సినిమా పోస్టర్‌ రిలీజ్‌ అయ్యాక నేను సినిమాలకు ట్రై చేస్తున్నట్లు నాన్నకు తెలిసింది. ముందు షాకయ్యారు. తర్వాత నా సక్సెస్‌ చూసి సంతోషపడ్డారు. అయితే నేను హీరోగా సక్సెస్‌ అయినప్పటికీ, మా నాన్న జిరాక్స్‌ షాపు నడిపిస్తున్నారు. ఇప్పటికీ బస్సులో ప్రయాణం చేయడానికే ఇష్టపడుతుంటారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది త ల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటాం. మా నాన్న నుంచి నేను అదే నేర్చుకున్నా.

- ప్రదీప్‌ రంగనాథన్‌


నా ప్రపంచం ఆయనే..

book1.4.jpgదిలీప్‌ భల్చంద్ర బోర్సే... మా నాన్న. ఆయన ఒక ఇంజనీర్‌. మోడల్‌గా ఉన్నప్పుడు నాన్న నన్ను ఏమీ అనలేదు... కానీ సినిమాల్లోకి వెళతాను అన్నప్పుడు మాత్రం ముందుగా వద్దన్నారు. అయితే నా మొండితనం చూసి ఒప్పుకొన్నారు. నన్ను ప్రోత్సహించి, జీవితాన్ని ఎలా చూడాలో నేర్పిన వ్యక్తి నాన్న. కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఆయన ఎన్నో నిశ్శబ్ద పోరాటాలు చేశాడు. నాకెప్పుడూ తోడుగా ఉంటాడు. నా ప్రపంచం, నా చీర్‌ లీడర్‌ కూడా ఆయనే.

- భాగ్యశ్రీ బోర్సే


ఈ వార్తలు కూడా చదవండి:

జర్నలిజంలో మీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం

కౌలు రైతులకు అరకొరగానే రుణాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 06:58 AM