రేపు ఢిల్లీకి వస్తున్నా
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:44 AM
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..
రెండు రోజులు అక్కడే ఉంటా
రైల్వేమంత్రితో భేటీ ఏర్పాటు చేయించండి
ఆ వివరాలను వీలైనంత త్వరగా తెలపండి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం కిషన్‌రెడ్డికి మరోసారి లేఖ రాశారు. మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించి సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా జోక్యం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న రాసిన లేఖనూ తాజా లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22, 23 తేదీల్లో తాను ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, ఈ సందర్భంగా రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ర్టానికి అత్యంత కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యంఉందని లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ అంశాలు సత్వరం పరిష్కారం కావాలని అభిలషించారు. అశ్వినీ వైష్ణవ్‌కు మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరిస్తానని, చర్చలకు అవసరమైన.. సంబంధిత ఒప్పందాలు, ఇతర పత్రాల ప్రతులను కూడా వెంట తీసుకువస్తానని తెలిపారు. సమావేశ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని ఆ వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని లేఖలో కిషన్‌రెడ్డిని కోరారు.