ఏపీకి ఆర్థిక సవాళ్లు
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:20 AM
ఆంధ్రప్రదేశ్ ఒకపైపు రుణభారాన్ని మోస్తూనే మరోవైపు సంక్షేమ పథకాల హామీలను నెరవేర్చాల్సిన పరిస్థితి ఉందని నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) పేర్కొంది.
మూలధన పెట్టుబడులకు అవకాశం కష్టమే
మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయమే 86 శాతం
జీతాలు, పింఛన్లు, వడ్డీ, సంక్షేమ పథకాలకే ఖర్చు ఎక్కువ
ఎన్‌ఐపీఎఫ్‌పీ-ప్రపంచ బ్యాంకు నివేదిక
న్యూఢిల్లీ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఒకపైపు రుణభారాన్ని మోస్తూనే మరోవైపు సంక్షేమ పథకాల హామీలను నెరవేర్చాల్సిన పరిస్థితి ఉందని నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) పేర్కొంది. ప్రపంచ బ్యాంకుతో కలిసి ఈ సంస్థ తాజాగా నివేదికను విడుదల చేసింది. అభివృద్ధి దృక్పథంతో కూడిన మూలధన పెట్టుబడులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం ఏపీకి అతి పెద్ద సవాలు అని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఏపీ ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. ఏపీలో రుణాలను నిర్వహించడం, మూలధన వ్యయానికి అత్యధిక ప్రాధా న్యం ఇవ్వడం అవసరమని నివేదిక సూచించింది. ఏపీ ఆర్థిక లోటు జీఎస్‌డీపీలో 4.68 శాతంగా 2025-26లో అంచనా వేశారని, ఇది ఫైనాన్స్ కమిషన్ సూచించిన 3 శాతం కంటే ఎంతో ఎక్కువని తెలిపింది. ఏపీకి రెవెన్యూ వసూళ్ల కంటే హామీలకు చెల్లించే మొత్తం ఎంతో ఎక్కువని, దీని వల్ల బ్యాలన్స్ షీట్ గతితప్పే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దిగువ రాష్ట్రాల జాబితాలో ఉన్న ఏపీ ఆర్థిక స్థిరత్వ సూచిక 29.6 మాత్రమేనని తెలిపింది. అయితే పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థిక లోటు తట్టుకోగలిగిందేనని ఈ నివేదిక వ్యాఖ్యానించింది. జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీల వంటి రెవెన్యూ వ్యయం మొత్తం ఖర్చులో 86 శాతం మేరకు ఉంటోందని, దీని వల్ల మూలధన పెట్టుబడులకు పరిమితంగా మాత్రమే అవకాశం ఉందని పేర్కొంది.
బడ్జెట్‌తో సంబంధం లేకుండా గతం లో భారీగా అప్పులు చేశారని, ఇప్పుడు ఆ అప్పులు పూర్తి గా తగ్గిపోవడం మంచి పరిణామమని తెలిపింది. తెలంగాణలొ రుణాలు, హామీలు, ఇతరభారాలు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ దానికి ఇతరరాష్ట్రాలతో పోలిస్తే బలమైన ఆర్థిక సామర్థ్యం ఉందరి తెలిపింది. ఆ రాష్ట్రంలో మొత్తం వ్యయంలో రెవెన్యూ ఖర్చు 86 శాతం ఉన్నందువల్ల మూలధన పెట్టుబడులకు వెసులుబాటు తక్కువేనని విశ్లేషించింది.