Share News

‘యాప్‌’రే... పది నిమిషాల్లో పనిమనిషి!

ABN , Publish Date - Mar 08 , 2026 | 09:57 AM

డబ్బు కన్నా సమయానికీ, సౌలభ్యానికీ విలువనిచ్చే పట్టణ, నగర జీవితాల్లో మొబైల్‌ యాప్‌లు ఓ భాగమైపోయాయి. ఇప్పటిదాకా రకరకాల యాప్‌లు చూశాం.

‘యాప్‌’రే... పది నిమిషాల్లో పనిమనిషి!

డబ్బు కన్నా సమయానికీ, సౌలభ్యానికీ విలువనిచ్చే పట్టణ, నగర జీవితాల్లో మొబైల్‌ యాప్‌లు ఓ భాగమైపోయాయి. ఇప్పటిదాకా రకరకాల యాప్‌లు చూశాం. ఇల్లూడ్చి, గిన్నెలను కడిగిపెట్టే మెయిడ్‌ సేవలను... బుక్‌ చేసిన పది నిమిషాల్లోనే అందించే యాప్స్‌... లేటెస్ట్‌ ట్రెండ్‌!

శనివారం పొద్దున్నే పని మనిషి ఫోన్‌ నుంచి వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌- ‘‘ఒంట్లో అస్సలు బాగో లేదమ్మా. ఈ రోజు రాలేను’’. వెంటనే ఆందోళన మొదలైంది శారదకు. పిల్లల ఆటలతో దుమ్ముగా వున్నగదులూ.. కిచెన్‌ సింక్‌లో పేరుకుపోయిన వంట పాత్రలూ, ఎంగిలి ప్లేట్లూ చూస్తుంటే నీరసం ముంచుకొచ్చింది. అసలే ఈ రోజు అతిథులు కూడా వస్తున్నారు.


నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లో నివసిస్తున్న ఆమెకు పరిష్కారం సులువుగానే దొరికింది. ఓ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని సర్వీస్‌ ఆర్డర్‌ చేసింది. పావుగంటలోనే కాలింగ్‌ బెల్‌ మోగింది. పింక్‌ రంగు యూనిఫామ్‌ ధరించిన ఓ మహిళ వచ్చి పనులన్నీ చకచకా చక్కబెట్టేసింది. కూరగాయలు, ఆకుకూరలూ శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగిపెట్టింది. రెండు గంటల శ్రమకు రూ. 200 తీసుకుని వెళ్లింది. ఇప్పుడు పని మనిషి సెలవు పెట్టినప్పుడల్లా శారద ఒకప్పటిలాగా గాభరా పడటంలేదు. ‘ఇన్‌స్టెంట్‌ డొమెస్టిక్‌ హెల్ప్‌’ యాప్‌లో హెల్పర్‌ను బుక్‌ చేస్తూ నిశ్చింతగా ఉంటోంది. ప్రస్తుతం ఆయా నగరాల్లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఈ తరహా ఇన్‌స్టెంట్‌ యాప్‌ సేవల జోరు ఊపందుకుంటోంది.


book5.2.jpgశిక్షణతో నాణ్యమైన సేవలు...

సత్వర ప్రయాణానికి ఊబర్‌, ఓలా, ర్యాపిడో... నచ్చిన ఆహార డెలివరీకి స్విగ్గీ, జొమాటో... వేగవంతమైన ట్రావెల్‌ బుకింగ్‌కు మేక్‌ మై ట్రిప్‌, గోఇబిబో... నిమిషాల్లో ఇంటికి సరుకులు అందించే బ్లింకిట్‌, బిగ్‌బాస్కెట్‌, ఇన్‌ స్టామార్ట్‌... ఇంటివద్దనే తక్షణ సెలూన్‌ సర్వీసులకు యస్‌మేడమ్‌, అర్బన్‌ క్లాప్‌... ఇవన్నీ చాలామందికి తెలిసినవే. ఆర్డర్‌ పెట్టిన పది నిమిషాల్లోనే వచ్చి ఇంటి క్లీనింగ్‌ పనులు చేసిపెట్టే మెయిడ్స్‌ను సరఫరా చేసే యాప్స్‌ కూడా వచ్చేశాయి. వాటిలో శ్నాబిట్‌ , ప్రోన్టో, అర్బన్‌ క్లాప్స్‌ ఇన్‌స్టా హెల్ప్‌, బ్రూమీస్‌ లాంటి స్టార్టప్స్‌ బెంగళూరు, దిల్లీ, ముంబయి, పుణె లాంటి నగరాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్‌ లాంటి చోట్ల ఈ యాప్‌ల వినియోగం విస్తరిస్తోంది.


book4.jpgఇల్లు ఊడ్చి, తుడవటానికైనా, వాడిన వంట పాత్రలు శుభ్రపరచడానికైనా, గుట్టలుగా పడివున్న దుస్తులు వార్డ్‌రోబ్‌లో పద్ధతిగా సర్దడానికైనా, వంటలో సాయం చేయడానికైనా మేమున్నామంటున్నాయి ఇన్‌స్టెంట్‌ మెయిడ్‌ సర్వీసులు. గిగ్‌ వర్కర్స్‌ నెట్‌వర్క్స్‌ ద్వారా ఈ స్టార్టప్‌ కంపెనీలు పనిచేస్తాయి. ఊబర్‌, ఓలాల్లాంటి వేదికలు క్యాబ్‌ డ్రైవర్లను ఎంపిక చేసుకున్నట్లే... ఈ కంపెనీలు తమ మొబైల్‌ యాప్స్‌లో జాబ్‌ రిక్వెస్టులను స్వీకరించి, మెయిడ్స్‌ నేపథ్య వివరాలను వెరిఫికేషన్‌ చేస్తాయి.


తర్వాత వారికి ప్రాథమికంగా శిక్షణను అందిస్తాయి. మెయిడ్‌ సర్వీసులకు ఆసక్తి చూపేది అత్యధికంగా మహిళలే. ఫుల్‌ డే వర్క్‌ (మొత్తం 8 గంటలు) కోసం ఒక్కో మహిళకు రూ. 22 వేల నుంచి రూ.30 వేల వరకూ నెల వేతనం ఇస్తున్నారు. అదే రోజుకు 2 గంటలు మాత్రం పనిచేస్తే నెలకు రూ.10 వేలు అందించే పద్ధతీ ఉంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌, బోనస్‌ లాంటి సదుపాయాలూ అందిస్తారు. యూనిఫామ్‌ను ధరించడం వల్ల కంపెనీ ప్రతినిధులుగా గుర్తింపు, వినియోగదారుల పరంగా గౌరవం లభిస్తాయి.


ఆర్డర్లు పెరుగుతున్నాయి...

  • 2025 ఆగస్టులో లక్ష ఆర్డర్లు వచ్చిన ‘శ్నాబిట్‌’... అక్టోబరులో 3 లక్షలతో, 2026 ఫిబ్రవరిలో 8.5 లక్షలతో జోరుమీదుంది.

  • 2025 మార్చిలో ఆరంభమైన ‘అర్బన్‌ కంపెనీ’కి చెందిన ఇన్‌స్టాహెల్ప్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజూ 50 వేల బుకింగ్స్‌తో దూసుకువెళ్తోంది.

రానున్న కాలంలో ఈ సేవలు మరింత ఊపందుకోనున్నట్లు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతానికి తక్కువ రుసుములకే మెయిడ్‌ సేవలు నాణ్యమైన రీతిలో, సులభంగా అందుబాటులోకి రావడంతో నగరవాసులు ఈ సేవల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు!


ఈ వార్తలు కూడా చదవండి:

ఎవరికీ సబార్డినేట్‌ని కాదు

సర్వం.. కల్తీ మయం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2026 | 09:59 AM