ఉన్న బిడ్డలకే దిక్కులేదు.. ముగ్గుర్ని కనాలా?
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:57 AM
‘ఉన్న బిడ్డలకే ఉద్యోగాలు లేవు. మీరిచ్చే రూ.25 వేల కోసం మూడో బిడ్డను కనాలా?’ అంటూ సీఎం చంద్రబాబు పాపులేషన్ పాలసీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.
పాపులేషన్ పాలసీపై షర్మిల ఎద్దేవా
ఉపాధి పథకంపై మోదీని ప్రశ్నించని జగన్, బాబు, పవన్
భీమడోలు, ఎర్రంపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర
భీమడోలు/చింతలపూడి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘ఉన్న బిడ్డలకే ఉద్యోగాలు లేవు. మీరిచ్చే రూ.25 వేల కోసం మూడో బిడ్డను కనాలా?’ అంటూ సీఎం చంద్రబాబు పాపులేషన్ పాలసీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు, చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో శనివారం ఆమె ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. రచ్చబండ సభల్లో ఉపాధి హామీ కూలీలు, రైతులతో మాట్లాడారు. ‘జగన్, చంద్రబాబు కలిసి రాష్ర్టాన్ని అప్పుల కుప్ప చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.15 వేల కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. వీబీజీ రామ్‌జీ పథకం కాంట్రాక్టర్ల జేబులు నింపేదిగా ఉంది. మోదీ ప్రభుత్వం తెస్తున్న కొత్త ఉపాధి చట్టంతో రాష్ట్రంపై రూ.ఐదు వేల కోట్ల భారం పడుతుంది. ఈ నిర్ణయాన్ని బాబు, జగన్, పవన్ వ్యతిరేకించడం లేదు. వీరికి రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. మాజీ సీఎం జగన్ మోదీకి వంగి వంగి దణ్ణాలు పెడుతున్నారు. మోదీ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించడం లేదు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలి’ అని షర్మిల అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.