నిన్నటి జ్ఞాపకం... లైబ్ర‘రీలు’గా...
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:32 PM
ఇప్పుడంటే ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది కానీ... ఒకప్పుడు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడాలంటే ఎస్టీడీ బూత్‌లే దిక్కు. ఇప్పుడు సరదాగా చూద్దామన్నా ఒక్క టెలిఫోన్ బూత్ కూడా కనిపించదు.
ఇప్పుడంటే ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది కానీ... ఒకప్పుడు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడాలంటే ఎస్టీడీ బూత్‌లే దిక్కు. ఇప్పుడు సరదాగా చూద్దామన్నా ఒక్క టెలిఫోన్ బూత్ కూడా కనిపించదు. అయితే యూకేలో అడుగుపెడితే అప్పటి టెలిఫోన్ బూత్‌లు కనిపిస్తాయి... సరికొత్తగా. కాలక్రమంలో వాటిల్లో పుస్తకాలు వచ్చి చేరాయంతే. అక్కడి అధికారుల కృషి ఫలితంగా ఫోన్‌బూత్‌లు కాస్తా... లైబ్రరీలుగా మారి పుస్తకప్రియులకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి.
దశాబ్దాల పాటు సేవలందించిన కొన్ని వస్తువులతో మనకు విడదీయలేని బంధం ఏర్పడుతుంది. కాలక్రమంలో కొన్ని కనుమరుగైనా... వాటిని గుర్తు చేసుకున్నప్పుడు తెలియని భావోద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రహదారి పక్కన, వీధుల్లో... కొన్ని ఏళ్ల పాటు సేవలందించిన ఫోన్ బూత్‌లు ఆ కోవకు చెందినవే. మొబైల్ ఫోన్లు రావడంతో ఎస్టీడీ బూత్‌లను ఉపయోగించే వారే కరువయ్యారు. ఫలితంగా అవి కనుమరుగైపోయాయి. దారి వెంట చూద్దామన్నా కూడా కనిపించకుండా పోయాయి. అయితే యూకేలో మాత్రం అలాంటి ఫోన్‌బూత్‌లు సరికొత్తగా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. స్థానిక సంస్థలు, బ్రిటిష్ టెలికామ్‌ల కృషి ఫలితంగా ఐకానిక్ ‘రెడ్ టెలిఫోన్ బూత్’లన్నీ లైబ్రరీలుగా మారాయి. ఇప్పటికీ వేల సంఖ్యలో టెలిఫోన్ బూతులు లైబ్రరీలుగా సేవలందిస్తున్నాయి.
సంఖ్య కాస్త తగ్గినా...
యూకేలో టెలికాం రంగంలో మొబైల్ విప్లవం ప్రారంభం కాక ముందు టెలిఫోన్ బూత్‌లదే హవా. 2002లో బ్రిటన్ వీధుల్లో 92 వేల ఫోన్ బాక్సులు ఉండేవి. మొబైల్ ఫోన్లు రావడంతో ఒక్కసారిగా వాటి సంఖ్య 51 వేలకు పడిపోయింది. వాటిలో 11 వేల ట్రెడిషనల్ రెడ్ ఫోన్ బాక్సులుండేవి. అయితే గత 20 ఏళ్లలో ఐకానిక్ ల్యాండ్‌మార్క్స్ అయినటువంటి ఫోన్ బాక్సులను సంస్థ తొలగించింది. కానీ చాలా పట్టణాల్లో, గ్రామాల్లో ఫోన్ బాక్స్ ఒక గుర్తింపుగా నిలిచిపోయింది. కొన్నిచోట్ల ల్యాండ్‌మార్క్‌లుగా కూడా మారాయి. ఐకానిక్ ఫోన్ బాక్స్ ఉన్న స్థానం ఖాళీగా మారిపోవడాన్ని ప్రజలు ఒప్పుకోలేదు. చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా చాలా కమ్యూనిటీలు బ్రిటిష్ టెలికాంతో మాట్లాడి రెడ్ ఫోన్ బాక్సులు యథావిధిగా ఉండేలా లాబీయింగ్ చేశాయి. ఫలితంగా వాటిని తీసేసే ప్రయత్నాలను టెలికాం సంస్థ విరమించుకుంది.
దత్తత తీసుకుని...
2009లో ‘అడాప్ట్ ఎ కియోస్క్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. ఇందులో భాగంగా స్థానిక కమ్యూనిటీలు, కౌన్సిళ్లు నిరుపయోగంగా ఉన్న టెలిఫోన్ బాక్సులను దత్తత తీసుకునేందుకు అనుమతినిచ్చింది. టెలికాం బాక్స్ యాజమాన్య హక్కు కోసం ఎవరన్నా దరఖాస్తు చేస్తే అధికారులు ఫోన్‌ను తొలగించి బాక్సును అక్కడే ఉంచి వెళ్లిపోయారు. 2009 నుంచి ఇప్పటి వరకు 1500కు పైగా టెలిఫోన్ బాక్సులు ఆర్ట్ గ్యాలరీలుగా, ఛాయ్ దుకాణాలుగా, పూల షాపుల్లా, లైబ్రరీలుగా మారిపోయాయి. ‘హార్ట్‌బీట్’ ట్రస్ట్ ఛారిటీ పారామెడిక్స్ ప్రమాద బాధితులను కాపాడేందుకు కొన్ని బాక్సుల్లో డీఫ్రిబ్రిలేటర్స్‌ను ఏర్పాటు చేసింది.
లైబ్రరీలుగా మారిన ఫోన్ బాక్సులకు తాళం వేయరు. ఎవరైనా సరే.... బాక్సులో నుంచి పుస్తకం తీసుకెళ్లవచ్చు. అయితే అలా తీసుకెళ్లినవారు కచ్చితంగా మరో పుస్తకాన్ని రీప్లేస్ చేయాలి. మరుసటి రోజు ఆ పుస్తకాన్ని తిరిగి తెచ్చి పెట్టాల్సి ఉంటుంది. వాటిల్లోని బుక్స్, మ్యాగజైన్స్, డీవీడీలు, క్యాసెట్ల వంటివి గ్రామస్థులు డొనేట్ చేసినవే. బ్రిటిష్ టెలికాం ప్రారంభించిన ‘అడాప్ట్ ఎ కియోస్క్’లో దేశవ్యాప్తంగా చాలా కమ్యూనిటీలు భాగస్వామ్యం అయ్యాయి. 1920 నుంచి రెడ్‌ఫోన్ బాక్స్ బ్రిటిష్ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. మొత్తానికి భలేగా ఉంది కదూ ఈ బాక్స్ లైబ్రరీ. గతాన్ని జ్ఞప్తికి తెస్తూనే లైబ్రరీలుగా సేవలందించడం విశేషమే.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News