ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ లీడర్ హెచ్చరిక
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:13 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సెక్రెటరీ అలీ లారిజానీ తాజాగా వార్నింగ్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ (Ali Larijani) తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీ, ప్రజల రక్తం చిందినందుకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కన్నుమూసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సన్నిహితుల్లో ఒకరిగా అలీ లారిజానీకి పేరుంది.
ఇజ్రాయెల్, అమెరికాల స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయని లారిజానీ తెలిపారు. ఈ దాడుల్లో వారికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వెనెజువెలా ఉదంతాన్ని కూడా ప్రస్తావించారు. వెనెజువెలా వలెనే ఇరాన్‌తో యుద్ధాన్ని త్వరగా ముగించేద్దామని అమెరికా భావించిందని చెప్పారు. చివరకు విఫలమైందని అన్నారు.
అమెరికా సైనికులు కొందరు తమకు చిక్కారని కూడా అలీ లారిజానీ సంచలన ప్రకటన చేశారు. వారు ప్రస్తుతం జైళ్లల్లో ఉన్నారని అన్నారు. ఇరాన్ దాడుల్లో ఆరుగురు అమెరికన్ సైనికులే మరణించారంటూ ట్రంప్ ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఇరాన్ దాడుల్లో 500 మందికి పైగా అమెరికన్లు మరణించారని అన్నారు. సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుందని హెచ్చరించారు. అయితే, అమెరికా మాత్రం ఈ ప్రకటనలను ఖండించింది. ఇరాన్ మోసాలు, అసత్య ప్రకటనలకు ఇది నిదర్శనమని పేర్కొంది.
ఈ వార్తలూ చదవండి:
అంతర్జాతీయంగా ఒత్తిడి తగ్గించేందుకే.. భారత్‌కు అనుమతిపై ట్రంప్ వివరణ..
అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్