Share News

50 ప్లస్‌... ఫిట్‌నెస్‌ మంత్రా!

ABN , Publish Date - Mar 08 , 2026 | 08:48 AM

ఫిట్‌నెస్‌ అంటే... కేవలం జనరేషన్‌ జెడ్‌, మిలీనియల్స్‌కు సంబంధించిన విషయం అనుకుంటే పొరపాటే. ఈ రోజుల్లో అన్ని వయసులవారికీ ఫిట్‌నెస్‌ అవసరం.

50 ప్లస్‌... ఫిట్‌నెస్‌ మంత్రా!

ఫిట్‌నెస్‌ అంటే... కేవలం జనరేషన్‌ జెడ్‌, మిలీనియల్స్‌కు సంబంధించిన విషయం అనుకుంటే పొరపాటే. ఈ రోజుల్లో అన్ని వయసులవారికీ ఫిట్‌నెస్‌ అవసరం. ముఖ్యంగా 50 ప్లస్‌ మహిళలు... ‘గోల్డెన్‌ డేస్‌’ ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలంటే ‘ఫిట్‌’నెస్‌ తప్పనిసరి. రోజువారీ పనులతో బిజీగా ఉన్నా, కాస్త సమయాన్ని కసరత్తులకు కేటాయించాల్సిందే. 50 ప్లస్‌లో ఫిట్‌నెస్‌ మంత్రాకు సూత్రాలివే...

‘ఇది నా ఫొటోనే... కాలేజీ రోజుల్లో ఇలా మెరుపుతీగలా ఉండేదాన్ని’...

‘అప్పట్లో ఉదయం లేవగానే పార్కుకు వెళ్లి నాలుగు రౌండ్లు జాగింగ్‌ చేసి వచ్చేదాన్ని... ఇప్పుడు ఇంటి పని, వంట పని, పిల్లల పని... క్షణం తీరకలేదు. వాకింగ్‌కు ఏం వెళతాం’ అనే మాటలు మహిళల కిట్టీపార్టీల్లో ఎక్కువగా వినిపిస్తుంటాయి. టీనేజీ పిల్లల తల్లులదీ అదే ధోరణి. కానీ ఫిట్‌నెస్‌ అనేది అన్ని వయసుల వారికీ ఎంతో అవసరం.


అదే మొదలు...

ఆధునిక జీవనంలో ఆరోగ్యమే మహాభాగ్యం. ముఖ్యంగా యాభైలలోకి వచ్చిన మహిళలు తమ గురించి, ఆరోగ్యం గురించి, తీసుకునే ఆహారం గురించి పూర్తిగా అశ్రద్ధ చేస్తారు. దాంతో కండరాల శక్తి తగ్గుతుంది. శరీరాకృతి మారుతుంది. బీపీ, షుగర్లు వచ్చేస్తాయి, ఆ వెంటే కీళ్లనొప్పులూ... ఇలా రకరకాల అనారోగ్యాలు దండయాత్రకి సిద్ధం అవుతాయి. సాధారణంగా 30 ఏళ్లు పైబడిన తరవాత ప్రతీ దశాబ్దానికి ప్రతీ ఒక్కరిలో 3 నుంచి 5 శాతం కండరాల శక్తి తగ్గుతుంది. పెరిమెనోపాజ్‌, మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్‌ స్థాయిలు మారడం వల్ల మరింత వేగంగా కండరాల శక్తిని కోల్పోతారు మహిళలు. అందుకే కండరాలను దృఢపరిచే వ్యాయామాలు మొదలుపెట్టాలి. అలాగే కండరాల బలం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఆర్థరైటీస్‌, డయాబెటీస్‌, ఆస్టియోపోరోసిస్‌ లాంటి వ్యాధులను కట్టడి చేయవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.


మూడు రోజులు... మూడు విభాగాలు...

రోజూ ఎక్సర్‌సైజులు చేసే అలవాటు లేని వాళ్లు కూడా చిన్న చిన్న వ్యాయామాలతో కండరాల శక్తిని పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా యాభై పైబడిన వాళ్లు ‘రెసిస్టెన్స్‌ ట్రెయినింగ్‌ ఎక్సర్‌సైజు’లను వారానికి మూడు రోజులు చేస్తే చాలని ఫిట్‌నెస్‌ పండితులు పేర్కొంటున్నారు. శరీరాన్ని మూడు కండరాల గ్రూపులు - కాళ్లు, వెన్నెముక, కేంద్రభాగం అని విభజించుకుని... ప్రతీ కండరాల గ్రూప్‌ కోసం ప్రతీ సెషన్‌లో మూడు ఎక్సర్‌సైజులు చేస్తే సరిపోతుంది. అయితే ఎక్సర్‌సైజుకి ముందు వార్మ్‌అప్‌, ఆ తరవాత కూల్‌డౌన్‌ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. నడక చాలా చక్కని వార్మప్‌ వ్యాయామం.


book3.2.jpgప్రొటీన్లు చాలా అవసరం

ఇక ప్రొటీన్ల విషయానికి వస్తే, ఇవి కండరాలకు శక్తినిస్తాయి. యాభై ఏళ్ల తరవాత ప్రొటీన్ల అవసరం శరీరానికి పెరుగుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. శరీర బరువును బట్టి ప్రతీ కిలోగ్రాముకు 1 నుంచి 1.2 గ్రాముల ప్రొటీన్‌ వయోజనులకు అవసరం. అలాగే ప్రతీ భోజనంలోనూ కనీసం 25 నుంచి 30 గ్రాముల ప్రొటీన్‌ ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఈ ఆహార పదార్థాల ద్వారా తగిన ప్రొటీన్లను పొందవచ్చు.

  • మాంసం: చికెన్‌, టర్కీ

  • చేపలు: సాల్మన్‌, తునా, ట్రౌట్‌

  • గుడ్లు: మొత్తం లేదా వైట్స్‌

  • పాల ఉత్పత్తులు: యోగర్ట్‌, కాటేజ్‌ ఛీజ్‌, పాలు

  • మొక్కల ప్రొటీన్లు: తోఫు, సోయా పనీర్‌, పప్పుధాన్యాలు, క్వినోవా


book3.5.jpgవిశ్రాంతి కీలకం

వ్యాయామాలు, తగిన పోషక పదార్థాలతో పాటు ఇంకో ముఖ్యమైన అంశం రికవరీ, విశ్రాంతి. వ్యాయామం తరవాత శరీరం తిరిగి శక్తి పుంజుకోవాలంటే తగినంత విశ్రాంతి అవసరం. ఇది కండరాల పెరుగుదలకు కూడా కీలకం. అసలే వయసు యాభై దాటింది కాబట్టి విశ్రాంతి ఇవ్వడం ముఖ్యం. అలాగే చెప్పారు కదా అని చేసేయకుండా, మీకు ఎలాంటి వ్యాయామం సరిపోతుంది? దేన్ని సులభంగా ఆచరించగలరు అన్నది కూడా నిపుణులతో మాట్లాడి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందరికీ ఒకే తరహా వ్యాయామాలు ఉండవని గమనించాలి. వ్యాయామం ప్రారంభించిన తరవాత కూడా శరీరం ఎలా స్పందిస్తోందనేది కచ్చితంగా ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ప్రతీ ఒక్కరూ మనసు, శరీరం చెప్పేమాటలను తప్పకుండా వినాలి. కష్టం అనిపించినా నిపుణులను సంప్రదించడం మరచిపోకూడదు.


ఏవైనా కొత్త పద్ధతులు, వ్యాయామాలను అలవాటు చేసుకునేందుకు శరీరానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి నిదానంగా అయినా లక్ష్యాలను సాధించాలి. యాభైలలో కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా 50 ప్లస్‌ తర్వాత ఆరోగ్యంపైనే కాస్త ఎక్కువ దృష్టి పెట్టాలి. మహిళలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటేనే... ఆరోగ్యకరమైన కుటుంబం, సమాజం ఏర్పడుతుందనేది గ్రహించాలి.


book3.3.jpgవయసు పరిమితి కాదు... పరిణామం

మలైకా అరోరాని చూస్తే కాలం ఆగినట్టు అనిపిస్తుంది. ఇన్నేళ్లయినా మలైకా శరీరాకృతిలో మార్పు లేదు. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే ఫిజిక్‌ ఆమె సొంతం. నా ఫిట్‌నెస్‌ మంత్రా... ‘తొందరగా నిద్రలేవడం, తొందరగా నిద్రపోవడం. చక్కని ఆహారం, క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌ చేయడం. అయితే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆక్సిజన్‌ థెరపీ తీసుకుంటాన’ని మలైకా చెబుతారు. వయసుకు సంబంధించి ఆమెకు కచ్చితమైన అభిప్రాయం ఉంది. ‘నా దృష్టిలో వయసు ఓ పరిమితి కాదు, ఓ పరిణామం. మనల్ని మనం అర్థం చేసుకోగల పరిజ్ఞానాన్ని పెరిగే ప్రతీ ఏడూ అందిస్తుంది. అందుకే ఓ వయసు వరకే అందంగా కనిపించాలని అనుకోవడం తప్ప’ని 52 ఏళ్ల మలైకా అంటోంది.


30ల నుంచే ఫోకస్‌...

పెళ్లయ్యి, పిల్లలు పుట్టాక మహిళలు ఇంటి పనుల్లో బిజీ అయిపోతారు. కనీసం అద్దంలో చూసుకునేంత తీరికలేనట్టుగా ఫీల్‌ అవుతారు. కానీ రిలయన్స్‌ అధినేత్రి నీతా అంబానీ మాత్రం ‘30 ఏళ్లు వచ్చాక మహిళలు తమ మీద ఎక్కువగా ఫోకస్‌ చేసుకోవాల’ని అంటున్నారు. ప్రతీ మహిళా కనీసం 30 నిమిషాలు తన కోసమే సమయం వెచ్చించాలని ఆవిడ సలహా ఇస్తున్నారు. 62 ఏళ్ల నీతా తన ఫిట్‌నెస్‌ మంత్రాని సాటి మహిళలతో పంచుకోవడానికి ఇష్టపడతారు. ఈత, నడక, జిమ్‌కు వెళ్లడంతో పాటు రోజువారీ వ్యవహారాలతో తనని తాను బిజీగా ఉంచుకునేలా ఆమె ప్లాన్‌ చేసుకుంటారు. అలాగే ‘పూర్తి శాకాహారంలో ప్రొటీన్లను తగుపాళ్లలో తీసుకుంటాన’ని చెప్పడమే కాదు, తన ఫిట్‌నెస్‌ రొటీన్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నీతా అంబానీ.


book3.4.jpgవ్యాయామమే సప్లిమెంట్‌

ఆడవాళ్లని వయసు అడగకూడదు అని అంటారు. కానీ మందిరా బేడీ ఇప్పుడు నాకు 53 ఏళ్లు అని ఓపెన్‌గా చెప్పేస్తారు. పైగా ‘30లలో, 40లలో ఎత్తలేని బరువుల్నీ ఇప్పుడు అవలీలగా ఎత్తేస్తున్నాను. నా కండరాలను చూపించడానికీ సిద్ధమేన’ని అంటున్నారు. టీవీ వ్యాఖ్యాతగా, నటిగా మందిర అందరికీ సుపరిచితురాలే. ఆరోగ్యంగా ఉండాలని అందరూ సప్లిమెంట్ల వైపు చూస్తారు. మందిర మాత్రం వ్యాయామమే నా సప్లిమెంట్‌, ఔషధం అంటారు. ఆమె ఎక్కువగా కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేస్తారు. ‘తద్వారా వృద్ధాప్యంలో శక్తి కోల్పోకుండా, బలంగా ఉంటామ’ని మందిర భరోసాగా చెబుతున్నారు.


స్వస్త్‌ రహో.. మస్త్‌ రహో...

‘ఫిట్‌నెస్‌ దివా’గా పేరుతెచ్చుకున్నారు శిల్పాశెట్టి. 52 ఏళ్ల శిల్ప బాలీవుడ్‌ తారగానే కాకుండా... ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌గా ప్రసిద్ధి చెందారు. ‘సింపుల్‌ సోల్‌ఫుల్‌’ పేరుతో ఫిట్‌నెస్‌ యాప్‌ను రూపొందించారు. యోగా, ఎక్సర్‌సైజ్‌, డ్యాన్స్‌, డైట్‌ ప్లాన్స్‌ ఆధారంగా సంపూర్ణ ఆరోగ్యం పొందేలా ఆయా రంగాల నిష్ణాతులతో ఈ యాప్‌ను తయారు చేయడం విశేషం. ఏఐతో అనుసంధానించిన యాప్‌ ఇది. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ సంబంధిత వీడియోలను సోషల్‌ మీడియాలో పెడుతూ అభిమానులకు స్ఫూర్తి కలిగిస్తుంటారు. ‘స్వస్త్‌ రహో, మస్త్‌ రహో (ఆరోగ్యంగా ఉండు, ఆనందంగా ఉండు) అన్నది ఆమె ఆరోగ్య సూత్రం.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎవరికీ సబార్డినేట్‌ని కాదు

సర్వం.. కల్తీ మయం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2026 | 08:48 AM