దారుణం.. నడిరోడ్డుపై యూట్యూబర్‌ను కాల్చి చంపిన దుండగులు
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:28 AM
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్, యూట్యూబర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల ఈ యువతికి టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆగస్టు 14న టాక్సిలా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షమ్సో తన సోదరుడు, సోదరితో కలిసి కారులో వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్పులు జరిపారు. మృతురాలి తండ్రి ఫజల్ సాహిబ్‌జాదా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..
కాశిఫ్ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన చెల్లి, తమ్ముడితో కలిసి కారులో బయటకు వచ్చారు. కాసేపటికే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి షమ్సో ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. ఆ వెంటనే తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో షమ్సో బీబీ మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో షమ్సో బీబీ సోదరి అసీమా కూడా తీవ్రంగా గాయపడింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. అయితే నిందితులకు షమ్సోబీబీకి సంబంధించిన సమాచారం అందించినట్లు అనుమానిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. హత్యపై రావల్పిండి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షమ్సో బీబీ హత్యకు ఆమె నిర్వహిస్తున్న సోషల్ మీడియా కార్యకలాపాలు కారణం కాదని, ఆర్థిక వివాదమే కారణమై ఉండొచ్చని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కౌసర్, జావేద్ అలియాస్ షాహీన్‌తో షమ్సోకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తండ్రి పోలీసులకు తెలిపారు. 2026 మార్చిలో టిక్‌టాక్ క్రియేటర్ సనా జావేద్ అనే యువతి కూడా ఇస్లామాబాద్‌లో ఇదే తరహాలో హత్యకు గురయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
చివరి రోజుకు చేరిన అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు.. చర్చించే అంశాలివే..