వందేమాతర వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు..
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:54 AM
జాతీయ గేయం 'వందే మాతరం' విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న తమ 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ గేయం 'వందే మాతరం' విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న తమ 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మరోవైపు కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నిర్ణయం ఆ పార్టీ దేశభక్తి, దేశం పట్ల విధేయతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆరోపించింది (Vande Mataram row).
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీ దేశభక్తి, దేశం పట్ల విధేయతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి తామే వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ గేయాన్ని పూర్తిగా గౌరవించేందుకు ఎందుకు సిద్ధంగా లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం, పార్లమెంట్, దేశం కంటే పార్టీ నిర్ణయానికే కాంగ్రెస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు (Congress Vande Mataram).
ఇక, పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించారు (BJP questions Congress loyalty). కాంగ్రెస్ తీరు చారిత్రక ముస్లిం లీగ్ వైఖరిని గుర్తుకు తెస్తోందని, ఆ పార్టీ కొత్త ముస్లిం లీగ్‌గా మారిందని ఆరోపించారు. 1931లో వందే మాతరం పూర్తి రూపంపై ముస్లిం లీగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ నిర్ణయం కూడా అదే తరహా మొండితనాన్ని ప్రతిబింబిస్తోందని బీజేపీ విమర్శించింది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..