మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. అగ్రనేతల ఘన నివాళి..
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:43 AM
భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఘన నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఆయనకు అంజలి ఘటించారు.
న్యూఢిల్లీ: భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఇవాళ (ఆగస్టు 20) ఘన నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఆయనకు అంజలి ఘటించారు. వారంతా రాజీవ్ గాంధీ స్మారక చిహ్నమైన వీరభూమిని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది.
ఈ సందర్భంగా ఆధునిక భారతదేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ కృషి ఎప్పటికీ స్మరించబడుతుందని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ శ్రేణులు నేడు మాజీ ప్రధాని జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ రాజీవ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. మరోవైపు రాజీవ్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ కూడా నివాళులు అర్పించారు. సద్భావనా దివస్ సందర్భంగా ఆయనను మోదీ స్మరించుకున్నారు. ‘భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అంటూ ఎక్స్ వేదికగా మోదీ పోస్టు చేశారు.
గుడ్‌విల్ డే..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు సద్భావనా దివస్ (గుడ్‌విల్ డే) జరుపుకుంటారు. ఈ రోజు మాజీ ప్రధాని ప్రతిపాదించిన విలువలను స్మరించుకుంటారు. ఇందులో జాతీయ ఐక్యత, శాంతి, సామరస్యం, యువతపై దృష్టి, లౌకికవాదం వంటి అంశాలు ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం, కుల, మత, జాతి భేదాలకు అతీతంగా సోదరభావాన్ని పెంపొందించడం.. ఆధునిక, సమ్మిళిత దేశ నిర్మాణానికి దోహదపడేలా భారతీయ యువతను ప్రేరేపించడం వంటివి రాజీవ్ గాంధీ దార్శనికతలో భాగం. అంతేకాకుండా, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ సంప్రదాయాలు, విలువలను నిలబెట్టడానికి ఆయన కృషి చేశారు. కాగా, ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984వ సంవత్సరంలో భారతదేశానికి 40 ఏళ్ల వయసులో రాజీవ్ గాంధీ 6వ ప్రధానమంత్రి అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఆపరేషన్ తర్వాత మహిళ కడుపులో గ్లౌజులు, పేపర్ వైప్స్.. మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యం..