Share News

బ్రిటన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీ చీకటి కోణాలను బట్టబయలు చేసిన బాధితులు!

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:06 PM

ఇంగ్లండ్‌లోని ప్రముఖ ఆర్మీ శిక్షణ కళాశాల వివాదంలో చిక్కుకుంది. ఉత్తర యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజీలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

బ్రిటన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీ చీకటి కోణాలను బట్టబయలు చేసిన బాధితులు!
UK Army Foundation College

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లోని ప్రముఖ ఆర్మీ శిక్షణ కళాశాల వివాదంలో చిక్కుకుంది. ఉత్తర యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న 'ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్' (AFC)లో 19 ఏళ్ల లోపు యువతీ యువకులను ఎంపిక చేసి.. శిక్షణ ఇస్తుంటారు. యువతకు శిక్షణ ఇచ్చే అతిపెద్ద ఆర్మీ కాలేజీ ఏఎఫ్‌సీ. అలాంటి కాలేజీలో రిక్రూట్లపై లైంగిక దాడి, వేధింపులు జరిగినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన నలుగురు మాజీ మహిళా సైనికులు తాము 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కాలేజీలో సామూహిక అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపించారు. సిబ్బంది, తోటి జూనియర్ సైనికులే ఈ అరాచకాలకు పాల్పడ్డారని బాధితులు తెలిపారు.


ప్రస్తుతం ఏఎఫ్ సీలో 889 మంది శిక్షణ తీసుకుంటున్న సైనికులు ఉండగా, అందులో 70 మంది మహిళా జూనియర్ సైనికులు ఉన్నారు. గతంలో బ్రిటన్ సైన్యం నిర్వహించిన సర్వేలోనూ 67 శాతం మంది మహిళా సైనికులు పురుష సహోద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. ఏడాది కాలంలో ఈ కాలేజీకి సంబంధించి పోలీసులకు 16 లైంగిక నేరాల ఫిర్యాదులు అందాయి.


ఇక బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 2018 జనవరి నుంచి 2025 జూన్ మధ్య కాలంలో ఈ ఒక్క కాలేజీలోనే ఏకంగా 176 లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో 32 ఫిర్యాదులు అక్కడే పని చేస్తున్న శాశ్వత సిబ్బందిపై, 144 ఫిర్యాదులు జూనియర్ సైనికులపై వచ్చాయి. గత ఐదేళ్లలో పలువురు ఇన్‌స్ట్రక్టర్లు కోర్టు ద్వారా శిక్షలు కూడా అనుభవించారు.


2023లో డేనియల్ కాన్వే అనే ఇన్‌స్ట్రక్టర్ నిద్రపోతున్న సహోద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి ఏడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. అలానే మరో ట్రైనీ కూడా లైంగిక దాడి కేసులో దోషిగా తేలాడు. ఈ ఘటనలపై బ్రిటన్ ఆర్మీ స్పందిస్తూ.. ఇవి అత్యంత బాధాకరమైన, తీవ్రమైన విషయాలని పేర్కొంది. సాయుధ బలగాల్లో నేరపూరిత ప్రవర్తనకు తావులేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడం లేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..

Updated Date - Aug 06 , 2026 | 04:14 PM