నీట్-యూజీ పరీక్ష విధానంలో మార్పులపై కేంద్రం కీలక అఫిడవిట్..
ABN , Publish Date - Aug 06 , 2026 | 02:50 PM
నీట్-యూజీ పరీక్ష విధానంలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
ఢిల్లీ: నీట్-యూజీ పరీక్ష విధానంలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్ష నిర్వహణపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది. జేఈఈ తరహాలో నీట్ నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది.
నందన్ నిలేకని నేతృత్వంలోని హైపవర్ టాస్క్‌ఫోర్స్ సిఫార్సుల ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని కేంద్రం పేర్కొంది. అలాగే, నీట్ అక్రమాల కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతోందని ధర్మాసనానికి తెలిపింది. ఎన్టీఏ స్థానంలో స్వతంత్ర, బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్ల విచారణ నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై పిటిషనర్లను సుప్రీంకోర్టు సమాధానాలు కోరింది. అనంతరం కేసు తదుపరి విచారణను జస్టిస్ పి.ఎస్.నరసింహ ధర్మాసనం ఆగస్టు 19కి వాయిదా వేసింది.
మరోవైపు, కంప్యూటర్ ఆధారిత విధానంలోకి మారితే ముందుగానే స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి వైద్యుల సంఘం (FAIMA) విజ్ఞప్తి చేసింది. పేపర్ లీకేజీలు, అక్రమాల నివారణకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్‌మెంట్ యాక్ట్-2026’ను కఠినంగా అమలు చేయాలని కోరింది. కాగా, పేపర్ లీక్ ఆరోపణలతో మే 3న నీట్ పరీక్ష రద్దవ్వగా.. జూన్ 21న ఎన్టీఏ రీ-టెస్ట్ నిర్వహించి ఫలితాలు వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
తమిళనాడులో మళ్లీ 'తమిళ్ తాయ్ వాళ్తు' వివాదం.. గవర్నర్‌కు 21 మంది ఎంపీల లేఖ
అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి