అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
ABN , Publish Date - Aug 06 , 2026 | 01:48 PM
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ మృతి చెందారు. జైలులో ఉన్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఝాన్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ నుంచి ఝాన్సీ జైలులో ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలిసేందుకు 21 ఏళ్ల అబాన్ అహ్మద్ తన స్నేహితులతో కలిసి హ్యుందాయ్ క్రెటా కారులో బయలుదేరాడు. ఝాన్సీ సమీపంలో కారు అతివేగంగా వెళ్తుండగా.. అకస్మాత్తుగా ఓ జంతువు అడ్డుగా రావడంతో డ్రైవర్ వాహనాన్ని మల్లించే ప్రయత్నం చేశాడు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు అబాన్ అహ్మద్, అతని స్నేహితుడు సోను అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అబాన్, సోను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమర్ అహ్మద్, మహమ్మద్ జైద్, అస్లాంకు చికిత్స కొనసాగుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించిన పోలీసులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. వాహనం అతివేగంతో ప్రయాణించడం కూడా ప్రమాదానికి ఒక కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
హత్యకు గురైన మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుటుంబం ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు, వివాదాలతో వార్తల్లో నిలిచింది. అతని కుమారుడు అసద్ అహ్మద్ 2023లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించగా, మరో కుమారుడు అలీ అహ్మద్ ప్రస్తుతం ఝాన్సీ జైలులో ఉన్నాడు. ఉమర్ అహ్మద్ కూడా పలు కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అబాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో మరో విషాదంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం
ఏపీ కేబినెట్ ముందుకు 30కి పైగా అజెండా అంశాలు..
Read Latest AP News And Telugu News