Share News

విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడం లేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:22 PM

విమాన ఇంధనంలో ఇథనాల్ కలిపే ప్రసక్తే లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు. ఇథనాల్ కలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.

విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడం లేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
Union Minister Rammohan Naidu

న్యూఢిల్లీ: విమాన ఇంధనం (Aviation Turbine Fuel)లో ఇథనాల్ కలిపే ప్రసక్తే లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు. ఇథనాల్ కలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల్లో అనవసర ఆందోళనలు కలిగించేలా బాధ్యతారాహిత్యంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. విమాన ఇంధనంలో ఇథనాల్ బ్లెండింగ్ చేపడుతున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


ఇథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) పూర్తిగా వేరని, రెండింటికి ఎలాంటి సంబంధం లేదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇథనాల్‌ను విమాన ఇంధనంగా ఉపయోగించడం లేదని, ఎస్‌ఏఎఫ్ అనేది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారుచేసే ప్రత్యామ్నాయ విమాన ఇంధనమని వివరించారు. ప్రయాణికుల భద్రతే కేంద్ర ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని రామ్మోహన్ నాయుడు పునరుద్ఘాటించారు. విమానయాన భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అన్ని నిర్ణయాలు అత్యున్నత భద్రతా ప్రమాణాల మేరకే తీసుకుంటామని చెప్పారు.


ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారనే ప్రచారాన్ని ఆ శాఖ ఖండించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ఆమోదించిన కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉందని పేర్కొంది. విమానయాన భద్రతకు సంబంధించిన అంశాలపై నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, అసత్య ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

నీట్-యూజీ పరీక్ష విధానంలో మార్పులపై కేంద్రం కీలక అఫిడవిట్..

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు.. అత్యాచారం కేసులో కీలక తీర్పు..

Updated Date - Aug 06 , 2026 | 03:39 PM