అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:12 PM
తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. 2013లో నమోదైన లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు గోవా బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
ఇంటర్నెట్ డెస్క్: తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. 2013లో నమోదైన లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు గోవా బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. అతడు రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
2013లో జూనియర్ సహోద్యోగినిపై అత్యాచారం చేసిన కేసులో తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఈయనను నిర్దోషిగా ప్రకటించింది. ఆ తీర్పును బాంబే హైకోర్టు (Bombay High Court) రద్దు చేసింది. 2013లో గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో హోటల్ లిఫ్ట్‌లో తనపై తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. దీంతో అదే ఏడాది నవంబర్‌లో అతడిని అరెస్ట్ చేశారు.
విచారణ అనంతరం 2021లో గోవా ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాలు చేసింది. అప్పీల్‌ను విచారించిన హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించింది. పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది (Tehelka Editor Case).
కాగా, ఈ కేసులో తానే బాధితుడినని తేజ్‌పాల్ పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తాను నిర్దోషినని పేర్కొంటూ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని వెల్లడించారు. తీర్పు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ్‌పాల్, 'నేను ఎలాంటి నేరమూ చేయలేదు. ఈ తీర్పుతో నేను ఏకీభవించడం లేదు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను' అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
తమిళనాడులో మళ్లీ 'తమిళ్ తాయ్ వాళ్తు' వివాదం.. గవర్నర్‌కు 21 మంది ఎంపీల లేఖ
అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి