Share News

ఏదో ఒక రోజు ఆయన్ను కలుస్తా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:29 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ పాలనాతీరును తప్పుబట్టిన ట్రంప్.. ఏదో ఒక రోజు తప్పకుండా ఆయనతో సమావేశమవుతానని చెప్పారు.

ఏదో ఒక రోజు ఆయన్ను కలుస్తా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని కలుస్తానన్నారు. ఇప్పటివరకు మొజ్తాబాను కలిసే అవకాశం రాలేదని చెప్పిన ట్రంప్.. ఆయన పాలనాతీరు ఏమీ బాగాలేదని, చాలా విషయాలలో వెనుకబడి ఉన్నారని విమర్శించారు.


'నేను మొజ్తాబా ఖమేనీని కలవాలనుకుంటున్నాను. అదంతా ఎలా కుదురుతుందో తెలీదు. కానీ ఏదో ఒక రోజు మేమిద్దరం కలుస్తాం' అని ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని ఇప్పటికే అంగీకరించిందని.. అమెరికాతో చర్చల్లో ఖమేనీ పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు ట్రంప్.


అందుకే అలా అన్నా..

లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ట్రంప్ అంగీకరించారు. లెబనాన్‌తో ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటం పట్ల తాను సంతోషంగా లేనని ఆయన చెప్పారు. నెతన్యాహు.. లెబనాన్‌తో నిత్యం దాడులకు దిగడంపై తాను కలత చెందానని.. అందుకే ఆ సమయంలో మాట తూలానన్నారు. కాగా.. ఇటీవల ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహుతో ఫోన్‌లో.. 'నీకు పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నేనే నిన్ను కాపాడుతున్నాను. ఇప్పుడందరూ నిన్ను, ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు' అని ట్రంప్ కోపంగా మాట్లాడినట్టు మీడియా కథనాలు నివేదించాయి. అయితే.. తనకు, నెతన్యాహుకు మధ్య మంచి సఖ్యత ఉందని ఆ అనుబంధాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు గుర్తుచేసుకున్నారు.


పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగిన నేపథ్యంలో ఇరాన్, అమెరికాల మధ్య సంప్రదింపులు దెబ్బతిన్నాయన్న వాదనలను ట్రంప్ ఖండించారు. కొన్ని రోజులుగా జోరుగా చర్చలు సాగుతున్నాయని ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పునరుద్ఘాటించారు. 'ఈ చర్చలు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు. కానీ నేను చెప్పినట్లుగా ఇరాన్ ఏదో ఓ విధంగా ఒప్పందం చేసుకోవాల్సిన సమయం వచ్చింది' అని ట్రంప్ పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

కువైట్‌, బహ్రెయిన్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

పశ్చిమాసియాలో కీలక అడుగు.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం

Updated Date - Jun 04 , 2026 | 11:35 AM