యూరోపియన్ దేశాలపై సుంకాల రద్దు.. ట్రంప్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Jan 22 , 2026 | 08:48 AM
గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌కి మద్దతు ఇచ్చే దేశాలపై సుంకాల విషయంలో వెనక్కి తగ్గారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రీన్‌లాండ్ అప్పగించే విషయంలో తనకు సహకరించకపోతే యూరోపియన్ దేశాలపై సుంకం విధిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొన్న ట్రంప్ యూరోపియన్ యూనియన్ (EU) దేశాలపై విధించాలనుకున్న సుంకాల విషయంలో యూటర్న్ తీసుకున్నారు.
ఇటీవల గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయడంలో అడ్డంకులు సృష్టిస్తున్నాయన్న కారణంతో నార్వే, డెన్మార్క్ స్వీడన్, ఫ్రాన్స్, యూకే, నెదర్లాండ్స్, జర్మనీ, ఫిన్ లాండ్ సహా 8 యూరోపియన్ దేశాలపై 10 శాతం టారీఫ్ లు విధిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెచ్చి, జూన్ 1 నుంచి 25 శాతానికి పెంచాలని అమెరికా భావించింది. దీంతో మిత్రదేశాల మధ్య వాణిజ్య పరమైన వార్ నడుస్తుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా ట్రంప్, నాటో చీఫ్ మార్క్ రుట్టే మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.
గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంతానికి సంబధించిన ఒక ఫ్రేమ్ వర్క్ నాటోతో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికాతో పాటు అన్ని నాటో సభ్య దేశాలకు మేలు జరుగుతుందని, ఈ ఒప్పందం వల్ల ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన సుంకాలను విధించడం లేదని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్: హోంమంత్రి అనిత
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ చీఫ్