ఉద్ధవ్‌కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్‌ఎస్
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:46 PM
ఎంఎన్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్థానిక నేతలను రాజ్ ఠాక్రే సూచించారు. దీంతో కల్యాణ్-డోంబివిలి ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని షిండే శివసేనకు మద్దతివ్వాలని స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
కల్యాణ్: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు కలిసి పనిచేసినప్పటికీ.. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి దెబ్బ తగిలింది. రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) కల్యాణ్-డోంబివిలి(Kalyan-Dombivli) కార్పొరేషన్‌లో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు మద్దతు ప్రకటించింది. కేడీఎంసీ ఎన్నికల్లో శివసేన(యూబీటీ), రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేశాయి. అయితే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం షిండే వర్గానికి ఎంఎన్ఎస్ మద్దతు ప్రకటించడంతో ఉద్ధవ్ వర్గానికి షాక్ తగలింది.
ఎంఎన్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్థానిక నేతలను రాజ్ ఠాక్రే సూచించారు. దీంతో కల్యాణ్-డోంబివిలి ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని షిండే శివసేనకు మద్దతివ్వాలని స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 122 స్థానాలకు షిండే శివసేన 53 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 50 సీట్లు దక్కించుకుంది. శివసేన(యూబీటీ) 11, ఎంఎన్ఎస్ 5, కాంగ్రెస్ 2, ఎన్‌సీపీ(ఎస్‌పీ) ఒక స్థానం గెలుచుకున్నాయి. ఎంఎన్ఎస్ మద్దతుతో షిండే శివసేనకు 58 మంది కార్పొరేటర్ల మద్దతు లభించింది. దీంతో అధికార మహాయుతి కూటమి కేడీఎంసీపై పట్టు సాధించినట్టైంది.
జనవరి 22న మేయర్ ఎన్నికలు..
కల్యాణ్-డోంబివిలి, మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ ఎన్నిక ప్రక్రియను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి 22న మేయర్ పోస్ట్ రిజర్వేషన్లకు సంబంధించి లాటరీ నిర్వహిస్తారు. రాష్ట్ర సెక్రెటేరియట్‌లో ఈ ప్రక్రియను నిర్వహించనున్నట్టు పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. రొటేషనల్ ప్రక్రియలో పోస్టును రిజర్వ్ చేస్తారు. జనరల్, మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ కేటగిరిల్లో రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్ కేటగిరి ప్రకటించగానే అర్హులైన అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశంలో మేయర్ల ఎన్నిక జరుగుతుంది. సభలోని మొత్తం సభ్యుల్లో సగానికి పైగా సభ్యుల బలం కలిగిన వారిని ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీయేలోకి టీటీవీ దినకరన్
తలరాత రాసి ఉంటే మా అన్న సీఎం అవుతారు..
Read Latest National News