Share News

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీయేలోకి టీటీవీ దినకరన్

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:41 PM

ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా తమిళ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీయేలోకి టీటీవీ దినకరన్

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారమే లక్ష్యంగా తమిళనాట ఎన్డీయే కూటమి ముందుకు సాగుతోంది. ఇటీవల కొంతకాలంగా ఎన్డీయేకు దూరంగా ఉంటున్న 'అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం'(AMMK) చీఫ్ టీటీవీ దినకరన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు.


తాజాగా.. బుధవారం ఏఎమ్ఎమ్‌కే చీఫ్ టీటీవీ దినకరన్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరారు. రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ పీయూష్ గోయల్‌ సమక్షంలో ఆయన కూటమి కండువా కప్పుకున్నారు. వీరి కలయిక.. ఒకప్పుడు విచ్ఛిన్నమైన భాగస్వామ్యాన్ని పునరుద్ధరిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముక్కులతార్ వర్గం ఓట్లను ఏకీకృతం చేయడం సహా అధికార డీఎంకే ఆధిపత్యాన్ని సవాల్ చేసేందుకు వీరి కలయిక బలోపేతం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


ఎన్డీయేలో చేరడంపై దినకరన్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలు, సుపరిపాలన కోసం పాత విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. తమిళనాడు అభివృద్ధి, సంక్షేమం, పార్టీ ఉనికి కోసం కొన్ని సమయాల్లో రాజీపడటం బలహీనత కాదని.. అది ఉమ్మడి ప్రయోజనాల కోసమేనని ఆయన పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత(అమ్మ) ఆశయాలను అనుసరించే వారంతా ఒకే తాటిపైకి వచ్చి, రాష్ట్రంలో మళ్లీ 'అమ్మ పాలన'ను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని గుర్తు చేశారు. జనవరి 23న చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు దినకరన్ హాజరై తన బలాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం.


2024 లోక్‌సభ ఎన్నికలలో.. తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్న టీటీవీ దినకరన్ ఏఎమ్ఎమ్‌కే పార్టీ.. తేని, తిరుచిరాపల్లి స్థానాల నుంచి పోటీచేసి 3,93,415 ఓట్లను సాధించింది. దినకరన్.. తేని లోక్‌సభ నుంచి పోటీ చేసి.. 25.65 శాతం వాటాతో 2,92,668 ఓట్లు సాధించారు. కానీ, డీఎంకే అభ్యర్థి తంగ తమిళ సెల్వన్ చేతిలో 2,78,825 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడినప్పటికీ ముక్కులతార్ వర్గంలో ఏఎమ్ఎమ్‌కేకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. తేని, శివగంగ, రామనాథపురం, మధురై వంటి దక్షిణ జిల్లాల్లోని ముక్కులతార్ వర్గాలలో టీటీవీ దినకరన్‌కు మంచి పట్టుంది. ఈ ఓట్లను బీజేపీ నేతృత్వంలోని కూటములకు ఏకీకృతం చేస్తుంది.


2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో టీటీవీ దినకరన్ ఎన్డీఏలో కొనసాగారు. ఎడప్పాడి పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన కూటమి నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత దినకరన్ ప్రత్యామ్నాయ రాజకీయ కూటముల కోసం ప్రయత్నించగా విఫలమైంది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీతోనూ చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!

Updated Date - Jan 21 , 2026 | 02:05 PM