బంగారాన్ని రాగి ప్లేట్లుగా రాశారు!
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:51 AM
శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
శబరిమల కేసులో భారీ కుట్ర ఉందన్న ఈడీ
ఏకకాలంలో మూడు రాష్ట్రాల్లో సోదాలు
21 చోట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు
వ్యవహారం బంగారం చోరీకే పరిమితం కాదు
ఆర్థిక అవకతవకలు, కుంభకోణాలు కూడా..
రెండు దశాబ్దాలు కొనసాగినట్టు అనుమానాలు
శబరిమల, జనవరి 20: శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో ఏళ్ల తరబడి కొనసాగిన బంగారం చోరీ వరకే దర్యాప్తు పరిమితం కాలేదు. శబరిమలలోని ఇతర ఆలయ ఆస్తుల దుర్వినియోగంపైనా దర్యాప్తు జరుగుతోంది. భక్తులు సమర్పించిన కానుకల దుర్వినియోగం సహా శబరిమలలో ఆర్థిక అవకతవకలు, కుంభకోణాలు కూడా జరిగినట్టు ఈడీ దర్యాప్తు తెలియజేస్తోంది. సుదీర్ఘకాలంగా వివిధ స్థాయిల్లోని వ్యక్తులు కుమ్మక్కై ఈ వ్యవహారాలు నడిపినట్టు స్పష్టమవుతోంది. ‘ఇందులో టీడీబీ(ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు) అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, మధ్యవర్తులు, స్వర్ణకారుల నేరపూరిత కుట్ర ఉంది’ అని ఈడీ మంగళవారం వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఈడీ ఈనెల 9న మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. ‘బంగారం పూత పూసిన పవిత్ర కళాఖండాలను రికార్డుల్లో ఉద్దేశపూర్వకంగా రాగి పలకలుగా నమోదు చేశారు. వాటిని 2019-2025 మధ్య ఆలయ పరిసరాల నుంచి తొలగించారు’ అని ఈడీ తెలిపింది. చెన్నై, కర్ణాటకల్లోని ప్రైవేటు సంస్థల్లో రసాయనిక ప్రక్రియల ద్వారా బంగారాన్ని స్వాహా చేసినట్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎంతవరకు మనీలాండరింగ్ ఉందో నిర్ధారించేందుకు సోదాలు జరిపినట్టు ఈడీ పేర్కొంది. బంగారం చోరీ వ్యవహారం తొలిసారిగా 2019లో వెలుగులోకి వచ్చినప్పటికీ, సుమారు రెండు దశాబ్దాలుగా కొనసాగుతుండొచ్చని ఈడీ వర్గాలు తెలిపాయి. ‘2019లో 42.8 కిలోల బరువున్న బంగారు విగ్రహాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లారు. వాటిని తిరిగి తీసుకొచ్చినప్పుడు వాటి బరువు 38.2 కిలోలే ఉంది. అంటే సుమారు 4.5 కిలోల బంగారాన్ని స్వాహా చేసేశారు’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విగ్రహాల పునః బంగారు తాపడం కోసం చెన్నైకి చెందిన ప్రైవేటు సంస్థకు అప్పగించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా, కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని మొత్తం 21 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, టీడీబీ మాజీ అధ్యక్షుడు ఎ.పద్మకుమార్‌లకు సంబంధించిన ప్రాంగణాల్లో ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.