Share News

నేను పెట్టుబడుల గురించి ఎప్పుడూ మాట్లాడను: సుధా మూర్తి

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:06 PM

డీప్‌ఫేక్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి సూచించారు. పెట్టుబడుల విషయంలో తాను చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై ఆమె స్పందించారు.

నేను పెట్టుబడుల గురించి ఎప్పుడూ మాట్లాడను: సుధా మూర్తి
Sudha Murty

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో డీప్‌ఫేక్‌(DeepFake) ఒకటి. దీని కారణంగా అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. ఈ వీడియోలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా.. తాజాగా రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి(Sudha Murty) కీలక విషయాలను వెల్లడించారు. ఆమె పెట్టుబడి స్కీమ్‌ల గురించి ప్రచారం చేస్తున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిపై సుధా మూర్తి స్పందిస్తూ.. అవి నకిలీ వీడియోలని, వాటిని నమ్మొద్దని ఆమె సూచించారు.


ఎక్స్‌ వేదికగా సుధామూర్తి(Sudha Murty) ఓ వీడియో విడుదల చేశారు. 'రూ.20వేలు పెట్టుబడి పెడితే.. పది రెట్ల రాబడి వస్తోందంటూ నేను చెప్పినట్లుగా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవి. ఈ డీప్‌ఫేక్‌ వీడియోలను చూసి ప్రజలు మోసపోవద్దు. వీటిని నమ్మి నాకు తెలిసినవారు డబ్బులు పోగొట్టుకున్నారు. నేను ఎప్పుడూ ఆర్థికపరమైన పెట్టుబడుల గురించి మాట్లాడను. ఇలాంటి వీడియోలతో ప్రజలు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్!' అని సుధామూర్తి రాసుకొచ్చారు.


సుధా మూర్తి ఒక ప్రసిద్ధ భారతీయ రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా అందరికి సుపరిచితురాలు. ఆమె ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తిని వివాహం చేసుకున్నారు. ఆమె అనేక పుస్తకాలను రచించారు. అలానే తరచూ సామాజిక సమస్యలు, సంస్కృతి, విద్య, మహిళా సాధికారతపై ప్రసంగిస్తూ ఉంటారు.

Updated Date - Jan 21 , 2026 | 04:40 PM