Share News

ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:41 PM

దావోస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్రబాబుతో వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సంభాషించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం.

ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నాం:  సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

దావోస్, జనవరి 21: ప్రపంచ ఆర్థిక సదస్సు(WEF)లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మూడో రోజు బిజీ బిజీగా గడిపారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబుతో వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సంభాషించారు. టైమ్ మీడియా ప్రతినిధి టిమ్ హోవాట్, బ్లూమ్‌బర్గ్ ప్రతినిధి జీనెత్ రోడ్రిగ్స్, బిజినెస్ టుడే ప్రతినిధి అలోక్ నాయర్, ఎన్‌డీటీవీ నుంచి ఆయుష్ ఐలావాదిలతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను వివరించారు.


నిరంతరం పనిచేస్తా..

ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంభాషణలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు వివిధ రంగాల్లో నూతన పరిణామాలను గమనించడానికి ఈ సదస్సు అద్భుతమైన వేదికగా ఉందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ను బ్రాండింగ్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తాను ఉపయోగించుకున్నానని చెప్పారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, దానివల్ల అభివృద్ధి జరుగుతుందని.. తద్వారా పేదలకు సంక్షేమం అందించవచ్చని సీఎం వివరించారు. నాడు సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీ క్వాన్ యూ, మలేషియా మాజీ అధ్యక్షుడు మహతీర్ తనకు స్పూర్తిగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఆశావాదినని, భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటని అన్నారు. ముందుచూపుతో వ్యవహరించి, వినూత్నంగా ఆలోచించి, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతానని సీఎం చెప్పారు. యువతకు ఇదే విషయాన్ని చెబుతూ, ఆ దిశగా ప్రోత్సహిస్తున్నానని తెలిపారు.


లోకేశ్ చొరవ వల్లే..

తమది పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్న ముఖ్యమంత్రి.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని, వాటి నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైమ్‌లో మానిటర్ చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ఉత్పత్తి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నానికి గూగుల్ కంపెనీ రావడం ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగుగా చంద్రబాబు అభివర్ణించారు. ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ ఈ విషయంలో చూపిన చొరవ, ఫాలో‌అప్ వల్లే ఆ పెట్టుబడి సాధించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ పెట్టుబడిపై లోకేశ్ సంప్రదింపులు జరిపారని ముఖ్యమంత్రి తెలిపారు.


సంస్కరణలను అందిపుచ్చుకుంటాం...

వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంతో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని, రాష్ట్రంలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే ఏపీలో ఉత్పత్తికి అడుగులు వేసి పరిశ్రమ నిర్మిస్తున్నామని చెప్పారు. విదేశాలకు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ఎగుమతి చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని తెలిపారు. టెక్నాలజీ, టెలికాం, విద్యుత్, ఏవియేషన్, నేషనల్ హైవేస్ రంగాల్లో వచ్చిన సంస్కరణలతో దేశ దశ దిశ మారిపోయిందని చంద్రబాబు అన్నారు. 30ఏళ్ల క్రితం దేశ అభివృద్ధిలో కీలక అడుగులు పడ్డాయని.. నేడు ప్రతి రంగంలో దేశం అద్భుత పురోగతి సాధిస్తోందని చెప్పారు. అప్పుడు.. ఇప్పుడు సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నామని, ఆ సంస్కరణలే తమ రాష్ట్రంలోని యువతకు అవకాశాలు కల్పించాయని సీఎం వివరించారు.


అద్భుత ప్రణాళికతో రాజధాని నిర్మాణం..

రాజధాని నిర్మాణం ఒక అవకాశమని.. అద్భుతమైన ప్రణాళికతో రాజధాని నిర్మాణం జరుగుతోందని చెప్పారు చంద్రబాబు. అమరావతి భవిష్యత్ నగరంగా ఉంటుందని, టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నామని తెలిపారు. టూరిజం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, మా రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని అన్నారు. ఏపీలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన ఆలోచనగా చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ అమలు చేస్తున్న విధానాలను, చేస్తున్న ఆలోచనలను, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం ఏపీ గురించి చర్చించుంటోందని తెలిపారు సీఎం.


భారత్‌‌కు అదనపు బలం అదే..

చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో ఉన్న ఏజింగ్ సమస్య భారతదేశానికి లేదని, సమర్థ మానవ వనరులు, టెక్నాలజీ ఇండియా అదనపు బలమని అన్నారు. ఒకప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను దిగుమతి చేసుకునేదని.. అలాంటి పరిస్థితి నుంచి ఆ రంగంలో ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. గతంలో డబుల్ డిజిట్ గ్రోత్ అంటే నమ్మలేదని, ఇప్పుడు అదే నిజమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 04:03 PM