చట్ట సభల్లో ‘నో వర్క్.. నో పే’.. స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:08 PM
చట్ట సభల్లో 'నో వర్క్.. నో పే' విధానం అమలులోకి తీసుకురావాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దీనిపై చట్టం చేసి.. తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు.
అమరావతి, జనవరి 21: లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు(AP Assembly Speaker Ayyanna Patrudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నో వర్క్.. నో పే’ అనే విధానం చట్టసభల్లోనూ రావాలని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా చట్టం చేయాలని.. దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆయా విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే.. సంబంధిత అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సహా వారి వేతనాలు నిలిపి వేస్తున్నారన్నారు. మరి తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సభకు రానప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అయ్యన్న తెలిపారు.
2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రానివారు ఉన్నారని.. కనీసం సభలో జరిగే ప్రశ్నోత్తరాలు, చర్చల్లోనూ పాల్గొనడం లేదని ఏపీ స్పీకర్ పేర్కొన్నారు. దీనివల్ల తమను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇలా సభకు హాజరు కాకపోవడం వలన ప్రజల దృష్టిలో సభ్యులు చులకనవుతున్నారని చెప్పుకొచ్చారు. సభకు హాజరు కాకుండానే వారు వేతనాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారంగా.. 'నో వర్క్.. నోపే' విధానానికి అనుగుణంగా చట్టం చేయాలని.. అఖిల భారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని కోరారు. సభకు రానివారిని రీకాల్ చేసే హక్కు ప్రజలకు కల్పించేలా చట్టం చేయాలని ఏపీ స్పీకర్ ప్రతిపాదించారు.
ఇవి కూడా చదవండి..
గంజాయి బ్యాచ్ వీరంగం.. ఇళ్లపై దాడులు.. భయాందోళనలో గ్రామస్థులు
కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
Read Latest AP News And Telugu News