Share News

గంజాయి బ్యాచ్ వీరంగం.. ఇళ్లపై దాడులు.. భయాందోళనలో గ్రామస్థులు

ABN , Publish Date - Jan 21 , 2026 | 10:26 AM

తిరుపతిలోని ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అంతేలేకుండా పోయింది. తరచూ గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్న గంజాయి బ్యాచ్ గత అర్థరాత్రి మరింత రెచ్చిపోయింది.

గంజాయి బ్యాచ్ వీరంగం.. ఇళ్లపై దాడులు.. భయాందోళనలో గ్రామస్థులు
Tirupati Ganja Gang

తిరుపతి, జనవరి 21: చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గత ​అర్థరాత్రి గంజాయి మత్తులో సన్నీ అనే వ్యక్తి సహా అతని అనుచరుల బృందం గ్రామంలోని పలువురి ఇళ్లపై రాళ్ల దాడి చేసింది. ఈ దాడిలో ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. గంజాయి బ్యాచ్ ఆగడాలతో గ్రామస్థులు భయంతో రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లోనే దాక్కున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు.


గ్రామానికి చేరుకున్న పోలీసులు.. అసలేం జరిగిందనే విషయాన్ని గ్రామస్థుల ద్వారా తెలుసుకున్నారు. విచారణ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా పోలీసులు వెళ్లిపోగానే గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయి గ్రామంలో అలజడి సృష్టించింది. దీంతో మరింత భయాందోళనకు గురయ్యారు గ్రామ ప్రజలు.


అయితే.. నిందితుడు సన్నీ ​గతంలోనూ పలుమార్లు ఇలాగే గ్రామంలో దాడులకు పాల్పడినట్లు గ్రామస్థులు వాపోయారు. సన్నీపై ఇప్పటికే రౌడీ షీటర్‌‌ కేసు నమోదు అయినట్లు సమాచారం. ​సన్నీ గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎగువరెడ్డివారిపల్లి గ్రామస్థులు వేడుకుంటున్నారు. ​గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టాలని ఆ ఊరి ప్రజలు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి..

బేగంపేట ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన కారు

నేరగాళ్ల గుర్తింపునకు పోలీసుల కొత్త విధానం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 11:09 AM