అది బీసీ.. ఇది ఎస్సీ.. ఆ పక్కది ఓసీ..
ABN , Publish Date - Jan 21 , 2026 | 08:47 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో.. డివిజన్ల రిజర్వేషన్లపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు కాలనీల్లో పర్యటిస్తున్నారు.
డివిజన్ల రిజర్వేషన్లపై ఊహాగానాలు
కాలనీల్లో పర్యటిస్తున్న ప్రధాన పార్టీల నాయకులు
బడంగ్‌పేట్ సర్కిల్‌లో మొదలైన ఎన్నికల హడావిడి
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీ కాలం ముగిసే సమయం దగ్గర పడుతుండడంతో.. అందులో విలీనమైన శివారు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్లను ఇటీవల గ్రేటర్‌లో విలీనం చేసిన సంగతి విదితమే. మొదట్లో రెండు కార్పొరేషన్లను రెండు వేర్వేరు సర్కిళ్లుగా ఏర్పాటు చేసి పాలన నడిపించిన అధికారులు.. ఆ తర్వాత జోన్లు, సర్కిళ్ల పునర్విభజనలో భాగంగా బడంగ్‌పేట్, మీర్‌పేట్ సర్కిళ్లను కలిపి ‘బడంగ్‌పేట్’ పేరుతో ఒకే సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. ఇక డివిజన్ల పునర్విభజనలో భాగంగా మీర్‌పేట్ సర్కిల్‌లో మూడు డివిజన్లు, బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో మరో మూడు డివిజన్లు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం అవన్నీ కలిసి ఒకే సర్కిల్ కిందకు వచ్చాయి. దాంతో బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు(నాదర్‌గుల్-57, ప్రశాంతిహిల్స్-58, జిల్లెలగూడ-59, మీర్‌పేట్-60, బడంగ్‌పేట్-61, బాలాపూర్-62) చేరాయి.
రిజర్వేషన్లపై లెక్కలు వేసుకుంటూ..
బడంగ్‌పేట్ సర్కిల్‌లోని ఆరు డివిజన్లలో గత ఎన్నికల నాటి జనాభా, ఓటర్ల వివరాల ఆధారంగా ఫలానా డివిజన్ ఫలానా వర్గానికి కేటాయిస్తారని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. మరోపక్క వారం రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్‌లలో ‘ఇవిగో డివిజన్ల రిజర్వేషన్ల వివరాలు’ అంటూ కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. తాము వేసుకున్న లెక్కలకు, వాట్సాప్ వైరల్ పోస్టులకు దగ్గరి పోలికలు ఉండడంతో దాదాపుగా అవే ఫైనల్ అయ్యే అవకాశమున్నదనే ధీమాతో ప్రధాన పార్టీల ఆశావహులు రంగంలోకి దిగారు.
డివిజన్లలో ఆశావహుల పర్యటనలు
ఫలానా డివిజన్ తమకు అనుకూలంగా రిజర్వ్ అవుతుందని నమ్ముతున్న ఆశావహులు సదరు డివిజన్లలో పర్యటనలు మొదలుపెట్టారు. పాత మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రధాన పార్టీల నేతలు, మాజీ కార్పొరేటర్లు ఇంచుమించు ఎన్నికల ప్రచారంలా తమ పర్యటనలు కొనసాగిస్తుండడం గమనార్హం! ప్రాథమిక అంచనాను బట్టి నాదర్‌గుల్, జిల్లెలగూడ డివిజన్లు జనరల్ కేటగిరీకి, ప్రశాంతిహిల్స్ డివిజన్ బీసీ మహిళకు, మీర్‌పేట్, బాలాపూర్ డివిజన్లు బీసీ జనరల్‌కు, బడంగ్‌పేట్ డివిజన్ ఓసీ(జనరల్) మహిళలకు రిజర్వ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
దాంతో సదరు కేటాయింపులను బట్టి ఆయా వర్గాలకు చెందిన ఆశావాహులు డివిజన్లలో పర్యటనలు ప్రారంభించారు. నాదర్‌గుల్ డివిజన్‌లో రెండు ప్రధాన పార్టీల నాయకులు ప్రజలను కలుస్తూ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని బహిరంగంగా విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం! ఓ పార్టీ నుంచి ఏకంగా ఇద్దరు నేతలు ఎవరికి వారుగా పర్యటనలు చేస్తూ, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిపై చర్యలు తీసుకునేలా చూస్తున్నారు. 58వ డివిజన్ ఎస్సీలకుగానీ, ఎస్టీలకుగానీ రిజర్వ్ అయ్యే అవకాశమున్నదని, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని జీహెచ్‌ఎంసీకి చెందిన సిట్టింగ్ కార్పొరేటర్ ఒకరు పేర్కొంటున్నట్టు తెలిసింది. ఎస్టీలకు రిజర్వ్ అయితే అభ్యర్థిని తానేనంటూ తన అనుచరులతో పేర్కొంటున్నట్టు సమాచారం. దాంతో 58వ డివిజన్ అంశం చర్చనీయాంశంగా మారింది.
కొసమెరుపు
గ్రేటర్ పదవీ కాలం ముగియక ముందే నేతలు పర్యటనలు మొదలు పెట్టడం అలా ఉంచితే.. 300 డివిజన్లను ప్రామాణికంగా తీసుకుని ఒకే కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ప్రకటిస్తారా.. లేక మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వేర్వేరుగా రిజర్వేషన్లు ప్రకటిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత ఊహాగానాలన్నీ ఉత్తివేనని, కార్పొరేషన్ల విభజనపై తుది నిర్ణయం తర్వాతే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటుండడం ఇక్కడ కొసమెరుపు!
అందరి దృష్టి బాలాపూర్ డివిజన్ పైనే
బడంగ్‌పేట్ సర్కిల్‌లోని బాలాపూర్ డివిజన్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బాలాపూర్‌లో మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్, కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ డీసీసీబీ చైర్మన్ తదితరులు ఉండడంతో రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా వస్తుందోననే ఆసక్తి నెలకొంది. జనరల్‌గా రిజర్వ్ అవుతుందని మొదట్లో ప్రచారం జరగడంతో కొందరు ఓసీ సామాజికవర్గం ఆశావహులు ప్రజల్లోకి వెళ్లారు. అయితే, ఇటీవల అది కాస్తా బీసీ వర్గాలకు రిజర్వ్ అయినట్టు ప్రచారం జరుగుతుండడంతో స్థానికంగా అయోమయం నెలకొంది. మరోపక్క ఎస్సీలకు కేటాయిస్తే బరిలో నిలవాలని గతంలో గెలిచిన, ఓడిన నేతలు ఆశిస్తున్నారు. సర్కిల్ పరిధిలో జనరల్‌కు కేటాయించిన డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
Read Latest Telangana News and National News