Share News

నేరగాళ్ల గుర్తింపునకు పోలీసుల కొత్త విధానం

ABN , Publish Date - Jan 21 , 2026 | 09:02 AM

కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తి బంధువుల ఇంట్లో చోరీ చేశాడు. బంగారు ఆభరణాలు సంచిలో సర్దుకున్న తర్వాత బయటకు వచ్చి ఆటో ఎక్కి పరారయ్యాడు. దీంతో ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఇలా.. ఆటోలు, డ్రైవర్ల వివరాల సేకరణకు పోలీసులు ఓ కొత్త అప్లికేషన్ను రూపొందించారు.

నేరగాళ్ల గుర్తింపునకు పోలీసుల కొత్త విధానం
Ntr District Police

  • ఆటో డేటాబేస్!

  • ఆటోలను అన్నివైపుల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్

  • ట్రాఫిక్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు బాధ్యతలు

  • ప్రత్యేకంగా అప్లికేషన్ రూపొందించిన అధికారులు

  • నగరంలో 30 వేల వరకు ఆటోలు 44

కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తి బంధువుల ఇంట్లో చోరీ చేశాడు. బంగారు ఆభరణాలు సంచిలో సర్దుకున్న తర్వాత బయటకు వచ్చి ఆటో ఎక్కాడు. నగరం నుంచి తెనాలి వెళ్లిపోయాడు. ఆభరణాలు కనిపించకపోవడంతో ఇంట్లో ఉన్న వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు ఒక ఆటోలో వెళ్లినట్టు కనిపించింది. ఆటో ఫొటోను పోలీసులు క్యాప్చర్ చేశారు. ఆటో నంబరు ఫొటోలో కనిపించడం లేదు. ఆటోకు ముందుభాగంలో రెండు బొమ్మలున్నాయి. అందులో ఒకటి రాజకీయ పార్టీ గుర్తు, రెండోది రాజకీయ మాజీ నాయకుడి ఫొటో. ఈ రెండింటి ఆధారంగా ఆటో డ్రైవర్‌ను గుర్తించారు. అతడిని విచారించగా నిందితుడిని ఎక్కడ గమ్యం చేర్చాడో తెలియజేశాడు. ఓ చోరీ కేసులో నిందితుడి అరెస్టు విషయంలో పోలీసులు ఉపయోగించిన టెక్నిక్ ఇది. ఇలా.. ఆటోలు, డ్రైవర్ల వివరాల సేకరణకు పోలీసులు ఓ అప్లికేషన్ను రూపొందించారు.


ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఇళ్లల్లో చోరీలు చేసిన తర్వాత నేరగాళ్లు ఆటోల్లో పారిపోతున్నారు. ప్రయాణికులు మాదిరిగా ఎక్కి వెళ్లిపోతున్నారు. కొంతమంది జిల్లా దాటేయడానికీ బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఇళ్లల్లో దొంగతనాలు చేసినా, మహిళల మెడలో బంగారం గొలుసులు లాక్కున్నా నేరగాళ్లు పారిపోవడానికి ఆటోలు ఉపయోగించుకుంటున్నారు. వారిని సాధారణ ప్రయాణికులుగా భావించి ఆటోడ్రైవర్లు ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఇలా నేరగాళ్లు పారిపోయిన ఆటోలను గుర్తించడానికి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. సాంకేతికంగా ఆటోలను ‘బంధి’స్తున్నారు. ఒకే కేసులో వచ్చిన ఫలితాలను పరిశీలించి ఈ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఆటోలకు సంబంధించిన అన్ని వివరాలను పక్కాగా సేకరిస్తున్నారు.


అన్ని వైపులా చిత్రాలు డేటాబేస్‌లో..

నగరంలో మొత్తం ఆరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 25 వేల నుంచి 30 వేల వరకు ఆటోలు తిరుగుతున్నాయి. ఇవికాకుండా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, మైలవరం ప్రాంతాల నుంచి ఆటోలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. విజయవాడ నగరంలో ప్రతి పోలీస్టేషన్ పరిధిలో తిరిగే ఆటోలకు వరుస సంఖ్యలను కొన్నాళ్ల క్రితం కేటాయించారు. ఆ నంబర్లతో ఇప్పటికీ కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి. ఆ వివరాలు కొన్నిస్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నగరంలో నిత్యం తిరిగే ఆటోలకు సీరియల్ నంబర్లు కేటాయించాలని తొలుత అధికారులు భావించారు.


ఈ ప్రక్రియ చేపడితే కృష్ణా జిల్లాలోని ఆటోలు వచ్చి చేరిపోతాయనే అనుమానంతో వెనక్కి తగ్గారు. చాలా ఆటోలపై ఇప్పటికీ పాత నంబర్లే కనిపిస్తున్నాయి. కమిషన‌రేట్ అధికారులు తాజాగా ఆటోలు, వాటిని నడిపే డ్రైవర్ల వివరాల సేకరణకు ఒక ఆప్లికేషన్ తయారు చేయించారు. ఒక్కో ట్రాఫిక్ పోలీస్టేషన్ పరిధిలో ఎన్ని ఆటోలు ఉన్నాయో వాటి వివరాలను ఎస్‌హెచ్‌వోలు ఈ అప్లికేషన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆటోకు ముందు భాగం, వెనుక వైపు, ప్రయాణికులు కూర్చునే భాగాలను ఫొటోలు తీసి ఆప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయాలి. వాటితో పాటు డ్రైవర్, యజమాని కార్డులు పొందుపరచాలి. వారి చిరునామా, ఫోన్ నంబర్లను నమోదు చేయాలి. ఇప్పటివరకు సుమారుగా మూడు వేల ఆటోల వివరాలను ట్రాఫిక్ పోలీసులు డేటాబేస్‌లోకి ఎక్కించారు.


ప్రయోజనం ఏమిటంటే?

ఎక్కడైనా నేరం జరిగినప్పుడు నేరగాళ్లు ప్రధాన రహదారుల మీదకు వచ్చిన తర్వాత ఆటోల్లో ఎక్కి పారిపోతున్నారు. పోలీసులు రంగులోకి దిగి సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినప్పుడు ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ఆటోలు వెళ్లే మార్గంలో సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించినప్పుడు కొన్నింటిలో మాత్రమే వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు కనిపిస్తున్నాయి. కొన్ని ఫుటేజీల్లో ఈ నంబర్లలో స్పష్టత ఉండటం లేదు. ఇటీవల ఓ చోరీ కేసులో నిందితుడు ఆటో ఎక్కి పారిపోయాడు. నేరం చేసిన తర్వాత అతడు వేసిన అడుగుల మార్గంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు నడుచుకుంటూ వచ్చి ఒక ఆటో ఎక్కాడు. ఈ దృశ్యాన్ని పరిశీలించిన పోలీసులు.. సదరు ఆటో నంబరును గుర్తించడానికి పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు.


అందులో ఆటో నంబరు కనిపించలేదు. ముందు భాగంలో అద్దాలకు కింద భాగంలో ఒక వైపున ఓ రాజకీయ మాజీ నాయకుడు ఫొటో, మరోపక్క ఒక రాజకీయ పార్టీ గుర్తు స్టిక్కరింగ్ ఉంది. నిందితుడు ఎక్కడ ఆటో ఎక్కాడో ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ఈ రెండు సింబల్లు ఉన్న ఫొటోలను పంపి విచారణ చేయించారు. ఆటోను గుర్తించి డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిని తెనాలిలో దింపినట్టు వెల్లడించి ఆ చిరునామాను ఇచ్చారు. ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చీకట్లో ఆటోల రిజిస్ట్రేషన్ నంబర్లు కనిపించనప్పుడు వాటికి వెనుక, ముందు ఉన్న గుర్తులు, సొట్టలు, వాటిపై పడిన గీతలు దర్యాప్తునకు ఆధారాలుగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత

For More AP News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 10:05 AM