భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:50 PM
దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వివిధ దేశాధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారులతో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అమరావతి/ దావోస్, జనవరి 21: భారత్ - ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదికని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీలో క్లీన్ - టెక్ పెట్టుబడులకు నూతన అవకాశాలున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం దావోస్‌లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బార్కాట్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇజ్రాయెల్‌తో విస్తృతంగా చర్చించామని చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్, యూఏవీ రంగాల్లో భారత్ - ఇజ్రాయెల్ భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలిపారు. అలాగే సెమీ కండక్టర్, క్వాంటమ్ టెక్నాలజీలో సహకార అవకాశాలతో పాటు నీటి శుద్ధి, భూగర్భ జలాల నాణ్యతపై ఇజ్రాయెల్ నైపుణ్యం, వినియోగంపైనా చర్చించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అదే విధంగా.. మెడికల్, విద్య, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల రూపకల్పనపై చర్చించామని వివరించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదన సహా ఏపీని మెడ్ - టెక్, ఏరో - డిఫెన్స్ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యం దిశగా అడుగులు పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక తయారీకి ఇజ్రాయెల్ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళికలపై సైతం ఈ సందర్భంగా కూలంకషంగా చర్చించామని చంద్రబాబు తెలిపారు.
రేపటితో ముగియనున్న సీఎం పర్యటన..
మరోవైపు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన రేపటితో అంటే.. గురువారంతో ముగియనుంది. జనవరి 22వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు జ్యూరిక్ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం చంద్రబాబు బృందం భారత్‌కు బయలుదేరనుంది. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
జ్యూరిక్‌లో ఘన స్వాగతం..
ఐదు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దావోస్ బయలుదేరి వెళ్లింది. ఈ బృందానికి యూరప్‌లో ఎన్నార్టీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమయ్యారు.
అలాగే స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ సైతం సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయనతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన అంశాలను సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. అలాగే దావోస్‌లో వివిధ దేశాల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీ బిజీగా ఉంటున్నారు. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయనతో పలు కీలక అంశాలను చర్చించినట్లు సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా వివరించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..
పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..
For More AP News And Telugu News